కరోనా వైరస్ భయంతో ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయానికి ప్రభుత్వాలు వ్యాక్సిన్ తప్పనిసరి చేశాయి. అయితే కొందరు వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.కొన్ని చోట్ల వేసిన వారికే మళ్లీ కరోనా టీకా వేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వేరే వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు అన్ని పెద్దవాళ్ల విషయంలో జరగడంతో వారు ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారు. తాజాగా నెలల శిశువులకు వేరే వ్యాక్సిన్ కు బదులు కోవిడ్ వ్యాక్సిన్ వేసిన ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... రెండు నెలల ఆడ శిశువు, నాలుగు నెలల మగ శిశువుకు ఓ నర్సు పొరపాటున కొవిడ్ టీకా వేసింది. దాంతో ఆ చిన్నారులిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆ చిన్నారులిద్దర్నీ వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. హెపటైటిస్-బి వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకుగాను రోగ నిరోధక శక్తి కోసం అందించే టీకాకు బదులుగా శిశువులకు ఆ నర్సు కొవిడ్ వ్యాక్సిన్ వేసింది. దీంతో వారి ఆరోగ్యంపై కరోనా వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుతం చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ నర్సును ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఆమెపై విచారణకు కూడా ఆదేశించారు.
