బ్రిజ్ భూషణ్‌‌‌‌పై రెండు కేసులు

బ్రిజ్ భూషణ్‌‌‌‌పై రెండు కేసులు
  • సుప్రీంకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
  • అరెస్టు చేసే దాకా నిరసనలను ఆపబోమన్న రెజ్లర్లు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌ఐ) చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌‌‌పై కేసు నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని విన్నవించారు. శుక్రవారం ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. శుక్రవారమే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని, పోలీసులపై ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు లేవని చెప్పారు. తమను బ్రిజ్‌‌‌‌ భూషణ్‌‌‌‌ లైంగికంగా వేధించారని, దీనిపై పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఏడుగురు రెజ్లర్లు వేసిన పిటిషన్‌‌‌‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ విచారించింది.

ఆ ‘జెంటిల్‌‌‌‌మన్‌‌‌‌’పై 14 కేసులున్నయ్: కపిల్ సిబల్

రెజ్లర్ల తరఫున విచారణకు హాజరవుతున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్.. ఆ ‘జంటిల్‌‌‌‌మన్‌‌‌‌’పై 14 కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, అందులో హత్యాయత్నం కేసు కూడా ఉందని బ్రిజ్ భూషణ్ పేరెత్తకుండా కోర్టుకు తెలియజేశారు. లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ సీల్డ్ కవర్‌‌‌‌లో అఫిడవిట్‌‌‌‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన బెంచ్.. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. 

పీటీ ఉష వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఫైర్

రెజ్లర్ల నిరసనలపై మాజీ క్రీడాకారిణి, ఎంపీ, ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష విమర్శలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన క్రీడాకారులు ఇలా రోడ్లెక్కి గొడవలు చేయడం వల్ల దేశం పరువుకు భంగం కలుగుతుందని కామెంట్ చేశారు. పీటీ ఉష వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాజకీయ గొంతుకలా ఆమె మారిపోయారని మండిపడ్డాయి.

తప్పుకునేందుకు సిద్ధం: బ్రిజ్ భూషణ్

తాను పదవి నుంచి తప్పుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తుంటే.. అందుకు సిద్ధంగా ఉన్నానని డబ్ల్యూఎఫ్‌‌‌‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. ‘‘నాపై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నా. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని చెప్పారు. 

అరెస్టు చేయాల్సిందే: రెజ్లర్లు

తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌లో రెజ్లర్లు నిరసనలు తెలుపుతున్నారు.  బ్రిజ్ భూషణ్‌‌‌‌ను ఆరెస్టు చేసేదాకా తాము నిరసనలను ఆపబోమని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.