ఆకాశంలో విందు కోసం వెళ్లి.. హాహాకారాలు పెట్టిన ఫ్యామిలీ.. గంటకు పైగా గాల్లో వేలాడిన టూరిస్టులు

ఆకాశంలో విందు కోసం వెళ్లి.. హాహాకారాలు పెట్టిన ఫ్యామిలీ.. గంటకు పైగా గాల్లో వేలాడిన టూరిస్టులు

ఆకాశంలో విందు.. వినటానికే భలే ఉంది కదా. నింగి నేలకు మధ్యన ఉండి.. చల్లని గాలులు, సమీపంలో ఉన్న మేఘాలను చూస్తూ లంచ్ చేయడం థ్రిల్లింగ్ ఫీలింగ్. కానీ అనుభూతి కోసం వెళ్లిన టూరిస్టులకు చేదు అనుభవం ఎదురైన ఘటన కేరళలో జరిగింది. ఆకాశంలో విందు ఆరగిద్దామని వెళ్లిన యాత్రికులు.. గంటన్నరకు పైగా గాల్లో వేలాడాల్సిన పరిస్థితి ఎదురైంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇడుక్కిలోని అనంచల్ లో స్కై డైనింగ్ రెస్టారెంట్ ఉంది. మున్నార్ కు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ లో గాల్లో కూర్చుని లంచ్ చేయడం చాలా త్రిల్ గా ఫీలవుతుంటారు టూరిస్టులు. అలాగే ఎంజాయ్ చేద్దామని వెళ్లిన టూరిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం (నవంబర్ 28) మధ్యాహ్నం1.30 గంటల తరువాత క్రేన్ ఫెయిల్ అవ్వటంతో మధ్యలోనే ఇరుక్కుపోయారు టూరిస్టులు. 120 ఫీట్ల ఎత్తులో భయంతో.. గంటన్నర పాటు గాల్లోనే హాహాకారాలు కొట్టాల్సి వచ్చింది టూరిస్టులు. 

సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ టీమ్ వచ్చి ఒక అరగంట పాటు శ్రమించి టూరిస్టు కుటుంబాన్ని కిందికి దింపారు. గాల్లో వేలాడుతున్న తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలను మొత్తానికి 4.30 తర్వాత కిందికి దించారు. కుటుంబం మొత్తం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి గాల్లోనే వేలాడుతూ ఉండిపోయినట్లు స్థానికులు తెలిపారు. 

ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్కై డైనింగ్ రెస్టారెంట్ సభ్యులు తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందుగానే ట్రైనింగ్ ఇస్తారని.. ఆందోళన అవసరం లేదని తెలిపారు. కోజికోడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ క్రెయిన్ టెక్నికల్ ప్రాబ్లంతో  కొంతసేపు గాల్లో వేలాడాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. 

లంచ్ కోసం టూరిస్టులను పైకి తీసుకెళ్తున్న క్రమంలో క్రేన్ లో వచ్చిన సమస్యతో 100 ఫీట్ల పైన టూరిస్టులు వేలాడాల్సి వచ్చిందని ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారని.. మేనేజ్మెంట్ అధికారులను అలర్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. 

స్కై డైనింగ్ అనేది అడ్వెంచర్ టూరిజంలో భాగంగా దేశంలో అక్కడక్కడా వెలసిన స్కై రెస్టారెంట్లు. కేరళ ఇడుక్కిలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్.. క్రేన్ సహాయంతో నడుస్తుంది. క్రేన్ పైన ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ పై లిమిటెడ్ మెంబర్స్ లంచ్ చేసే సదుపాయం కల్పించారు.  అయితే ఇడుక్కిలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్.. 2 నెలల క్రితం ప్రారంభించారు. ఘటనకు గల కారణాలను, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమేమైనా ఉందా అనే కోణంలో విచారణ జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.