రాహుల్ చెప్పినట్టుగా 2లక్షలు మాఫీ : వివేక్ వెంకటస్వామి

రాహుల్ చెప్పినట్టుగా 2లక్షలు మాఫీ : వివేక్ వెంకటస్వామి
  •  ఇచ్చిన మాట నెరవేర్చిన కాంగ్రెస్​సర్కార్ 
  • రైతుల తరఫున సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే కృతజ్ఞతలు

కోల్​బెల్ట్, వెలుగు: వరంగల్​రైతు డిక్లరేషన్​లో రాహుల్​గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్​సర్కార్ రైతులకు రుణమాఫీ చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సర్కార్ రైతు రుణమాఫీ ప్రకటనతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్న  నేపథ్యంలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.  

అధికారంలోకి వస్తె రూ. 2 లక్షల రుణమాఫి చేస్తామని వరంగల్ డిక్లరేషన్​లో రాహుల్​గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్​రెడ్డి రుణమాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్​రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని, ఆయనకు రైతులు రుణపడి ఉంటారన్నారు. కేసీఆర్​ విధానాలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆయన రైతులను మోసం చేశాడని తెలిపారు. 

రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల పాలయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. సర్కార్ నిర్ణయంతో చెన్నూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రైతాంగమంతా పండుగ చేసుకుంటున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేస్తున్నందుకు హర్షం ప్రకటిస్తూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు.