సెమికండక్టర్ల తయారీపై ఫోకస్

సెమికండక్టర్ల తయారీపై ఫోకస్
  •     ఇన్వెస్టర్లకు రూ.7,300 కోట్ల వరకు ప్రోత్సాహకాలు
  •     పీఎల్‌‌ఐ కింద అప్లయ్ చేసుకున్న 20 కంపెనీలు..వేగంగా అనుమతులు
  •     ఇప్పటికే ఆసక్తి ప్రకటించిన టాటా గ్రూప్‌‌


మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్‌‌‌‌లో ప్రొడక్షన్‌‌ తగ్గించేశాయి.పెద్ద పెద్ద వెహికల్ తయారీ కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌ను తగ్గించేయడానికి ప్రధానం కారణం గ్లోబల్‌‌గా చిప్‌‌ల కొరత ఉండడమే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌‌, ఆటోమేషన్‌‌, మొబైల్స్‌‌ ప్రొడక్షన్‌‌ వంటివి  పెరుగుతుండడంతో  సెమీకండక్టర్లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. కానీ, ఈ డిమాండ్‌‌కు తగ్గ సప్లయ్ మాత్రం లేదు. ఎలక్ట్రానిక్స్‌‌ డిజైన్‌‌ హబ్‌‌గా ఉన్న ఇండియా,  సెమీకండక్టర్లను తయారు చేయడంలో లైన్‌‌లో ఎక్కడో ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీపై ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీపై  ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్‌‌ పెడుతోంది. దేశంలో సెమీకండక్టర్ల ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసే కంపెనీలకు 40–50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని  చూస్తోంది. గత 20 ఏళ్ల నుంచి సెమీకండక్టర్ల కంపెనీలను ఆకర్షించడంలో ఇండియా ఫెయిల్‌‌ అయ్యిందనే చెప్పాలి. 2007 లో దేశంలో చిప్‌‌ల తయారీ ప్లాంట్‌‌ను పెట్టడానికి ఇంటెల్‌‌ ముందుకొచ్చినా, అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో  ఈ కంపెనీ తన ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయలేదు. జేపీ అసోసియేట్స్‌‌, హెచ్‌‌ఎస్‌‌ఎంసీ దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌‌ను పెట్టడానికి 2013 లో ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌ను అందించాయి. ప్రభుత్వం కూడా క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌లో 40 శాతం వరకు సబ్సిడీగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ, చివరి నిమిషంలో ఫండ్స్‌‌ సరిపోక ఈ కంపెనీలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. 
ఈసారి డిఫరెంట్‌‌..
ప్రొడక్షన్ లింక్డ్‌‌ ఇన్సెంటివ్ (పీఎల్‌‌ఐ) స్కీమ్‌‌  మలేషియా, చైనా, వియత్నాం వంటి దేశాలు ఆఫర్ చేస్తున్న వరల్డ్‌‌ క్లాస్‌‌ స్కీమ్‌‌లతో పోటిపడగలదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు కంపెనీలు, ఇండస్ట్రీల అభిప్రాయాలను తీసుకొని పాలసీలను రెడీ చేస్తోందని అన్నారు. కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌‌ (ఈఓఏ)  సబ్మిట్ చేసిన 20 పైగా కంపెనీలకు అనుమతులు ఇవ్వడంపై చివరి దశలో ఉన్నామని ప్రభుత్వ సీనియర్ అధికారులు అన్నారు. ఈ 20 కంపెనీల్లో సౌత్‌‌ కొరియా, తైవాన్‌‌ దేశాలకు చెందిన పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. కొత్త తరం  సెమీకండక్టర్లు గెలియం నైట్రేడ్‌‌ సెమీకండక్టర్ల తయారీకి కూడా ప్రభుత్వం వెల్‌‌కమ్‌‌ చెబుతోంది. అబుదబీకి చెందిన నెక్స్ట్‌‌ ఆర్బిట్‌‌ వెంచర్స్‌‌ కన్సార్షియం గుజరాత్‌‌లో ఒక సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడంలో ఫైనల్‌‌ స్టేజ్‌‌లో ఉంది. ఇజ్రాయెల్‌‌, తైవాన్‌‌ దేశాలకు చెందిన పెద్ద టెక్‌‌ కంపెనీలతో ఈ కన్సార్షియంతో టై అప్ అయ్యి ఈ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయబోతోంది. సుమారు 3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా ల్యాండ్‌‌ను   50 శాతం సబ్సిడీ రేటుతో ఆఫర్ చేసింది. వాటర్, పవర్‌‌‌‌ను ఇంటర్నేషనల్ రేట్లకు ఇస్తోంది. ‘ప్రభుత్వం రీయింబర్స్‌‌మెంట్ పద్ధతిలో ఇన్సెంటివ్‌‌లు ఇవ్వాలని చూస్తోంది. కానీ, 3–5 బిలియన్ డాలర్లను సేకరించాలంటే చాలా కష్టం. అందుకే మేమొక డాలర్ పెడితే, ప్రభుత్వం కూడా ఒక డాలర్‌‌‌‌ను తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి’ అని నెక్స్ట్‌‌ ఆర్బిట్‌‌ వెంచర్స్‌‌ ఫౌండర్‌‌‌‌ అజయ్ జలాన్ అన్నారు. సబ్సిడీని ముందే ఇవ్వాలని ఆయన చెప్పారు. టీఎస్‌‌ఎంసీ, శామ్‌‌సంగ్‌‌, ఇంటెల్ వంటి కంపెనీలు ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలప్ అయిన దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. టవర్ సెమీకండక్టర్స్‌‌ వంటి సెకెండ్‌ టైర్ కంపెనీలను ఆకర్షించడంలో ఇటలీ, సింగపూర్ వంటి కంపెనీలు పోటీపడుతున్నాయి.  ఇటువంటి కంపెనీలను వదులుకోకూడదని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. 

2014 నుంచే..
ప్రస్తుతం గ్లోబల్‌‌గా ఇండియాకు కొంత అడ్వాంటేజి కనిపిస్తోంది. దేశంలో ఎలక్ట్రానిక్స్ వాడకం విపరితంగా పెరుగుతోంది. దీనికి తోడు కంపెనీలు కూడా చైనాకు వెలుపల తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి.  కంపెనీలు 1 –5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌మెంట్లను పెట్టడానికి ఈ కారణాలు సరిపోవని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్సెంటివ్‌‌లు ఇవ్వడంలో పాలసీలను త్వరగా తీసుకురావాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సెమీ  కండక్టర్‌‌‌‌ తయారీ కంపెనీలను ఏర్పాటు చేయాలని కార్పొరేట్ కంపెనీలకు  2014 లో అప్పటి ఎలక్ట్రానిక్స్‌‌ అండ్ ఐటీ  మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్‌‌ లెటర్స్ రాశారు కూడా. అప్పుడు ఏ కంపెనీ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్‌‌ రాలేదు. కానీ, గత కొన్ని నెలల నుంచి చిప్‌‌ల షార్టేజ్‌‌ ఏర్పడడంతో ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం కంపెనీలు చూస్తున్నాయి. సెమికండక్టర్ తయారీ బిజినెస్‌‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. పీఎల్‌‌ఐ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ కోసం ఇప్పటికే 20 కంపెనీలు అప్లయ్ చేసుకున్నాయి.