20 కుక్కలను పిస్టల్​తో కాల్చి చంపిన్రు

20 కుక్కలను పిస్టల్​తో  కాల్చి చంపిన్రు
  •  మహబూబ్​నగర్​ జిల్లా పొన్నకల్​లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ నలుగురు దుండగులు
  • తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులుషూటింగ్​ ప్రాక్టీస్​ కోసమే కాల్చి ఉంటారని అనుమానాలు

అడ్డాకుల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్​ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని దుండగులు గల్లీ గల్లీ తిరుగుతూ 20 కుక్కలను పిస్టల్​తో కాల్చి చంపారు. మొత్తం 25 కుక్కలపై కాల్పులు జరపగా.. 20 అక్కడికక్కడే చనిపోయాయి. మరో ఐదు గాయపడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1.50 గంటలకు దుండగులు సిల్వర్​ కలర్​ బ్రెజా కారులో గ్రామానికి వచ్చారు. మొదట సీతారామాలయం వెనుక భాగంలో ఓ ఇంటి వద్ద పడుకున్న కుక్కను పిస్టల్​తో కాల్చారు.

 ఆ తర్వాత వరుసగా 3, 4, 8, 9, 7, 10, 11 వార్డుల్లో కారులోనే తిరుగుతూ కుక్కలను ఉరికిస్తూ కాల్చి చంపారు. రోడ్డుపై పడ్డ బుల్లెట్ లను గమనించిన పోలీసులు.. దుండగులు లోకల్​మేడ్​గన్​ను ఉపయోగించినట్లు చెప్పారు. పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కుక్కల కళేబరాలకు గ్రామ శివారులో వెటర్నరీ డాక్టర్​ రాజేశ్​ ఖన్నా ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి.. అక్కడే జేసీబీతో గుంత తీసి పూడ్చారు. అర్ధరాత్రి గ్రామమంతా తుపాకుల శబ్దంతో దద్దరిల్లగా.. ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

అయితే, హైదరాబాద్​కు చెందిన వ్యక్తులు షూటింగ్​ ప్రాక్టీస్​ కోసమే కాల్చి ఉంటారని కొందరు, కుక్కల బెడద నివారణ కోసం స్థానికులే ఈ పని చేసి ఉంటారని ఇంకొందరు అనుమానిస్తున్నారు. కాగా, గ్రామంలోకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కుక్కలను కాల్చారని  రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. దుండగులు రెండు సార్లు గ్రామంలోకి వచ్చి వెళ్లినట్లు ఆయన చెప్పారు. అయితే, వారు వచ్చిన విషయం తమకు ఎందుకు తెలియజేయలేదంటూ పోలీసులు రాజారెడ్డిని విచారణ కోసం తీసుకెళ్లారు. ఆయన వద్ద ఉన్న లైసెన్స్​డ్​ గన్​ను కూడా పట్టుకెళ్లారు.

వచ్చింది ఎవరు?

కారులో వచ్చిన దుండగులు ఎవరు? కుక్కలను ఎందుకు చంపారనేది అంతుచిక్కడం లేదు. లోకల్​ మేడ్ గన్ వాడినట్లు పోలీసులు చెబుతుండడం, చీకట్లోనూ గ్రామంలోని అన్ని వీధులు తిరగడాన్ని బట్టి ఈ ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.