దేశంపై ఎల్నినో ఎఫెక్ట్ మొదలైనట్లే కనిపిస్తున్నది. ఇందుకు సంకేతంగా నైరుతి రుతుపవనాలు మాయమయ్యాయి. దేశ భూభాగంపై జాడ లేకుండా పోయాయి. రుతుపవనాల విస్తరణకు అంతా అనుకూలంగా ఉందని వాతావరణశాఖ చెప్తూ వచ్చినప్పటికీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రకాల గాలుల మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో రుతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఈపాటికి 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతానికే పరిమితమైంది. దాదాపు 20 శాతం లోటు కనిపిస్తున్నది. 19 జిల్లాల్లో 50 శాతానికిపైగానే లోటు ఉన్నది. హనుమకొండలో 77 శాతం లోటు వర్షపాతం నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వర్షపాత లోటు అత్యంత ఎక్కువగా ఉన్నది. జూలైలో పరిస్థితి ఏమైనా మారే అవకాశాలుంటాయా అన్నది వేచి చూడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు, ఎండ మంట, ఉక్కపోత తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ ఎండల ప్రభావం తీవ్రమైంది.
మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 19 జిల్లాల్లో ఎండల ప్రభావం కనిపించింది. మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన మహారాష్ట్రలో వర్షపాతలోటు 65 శాతంగా ఉంది. 55 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉన్నా.. కేవలం 19 మిల్లీమీటర్లే కురిసింది. మాన్సూన్ ఎంటరైన ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనూ 40 శాతం వరకు వర్షపాత లోటు ఉన్నది. 120 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉన్నా.. అక్కడ కూడా 77 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, వర్షాలు మొదలయ్యాకే విత్తనాలు వేయాలని, ముందే వేస్తే ఎండలకు మాడిపొయ్యే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
