వాంటెడ్ లేబర్: కార్మికుల్లేక ఆగమైతున్నఫ్యాక్ట‌రీలు

వాంటెడ్ లేబర్: కార్మికుల్లేక ఆగమైతున్నఫ్యాక్ట‌రీలు

20 వేల జాబ్స్ ఖాళీ
కార్మికుల్లేక ఆగమైతున్నఫ్యాక్ట‌రీలు
కరోనాదెబ్బకు చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు కుదేలవుతున్నాయి. పనిచేసే కార్మికుల్లేక ఉత్పత్తి ఆగి నష్టపోతున్నాయి. డబుల్ ‌జీతం ఇస్తామన్నా లోకల్ ‌యూత్ ‌ముందుకు రాకపోవడంతో ఆగమైతున్నాయి. ఏఫ్యాక్టరీ దగ్గర చూసినా‘వాంటెడ్‌ లేబర్‌’బోర్డు లు కనబడుతున్నాయి. సర్కారుకు గోడు చెప్పి సాయం చేయమంటే సప్పుడు చేయకపోవడంతో వేరేదిక్కు లేక మూసేసే దీనస్థితిలో ఉన్నాయి. వర్కర్స్ కావాలంటూ పటాన్ చెరులోని ఓఫ్యాక్టరీ గేటుకు ఇలా బోర్డులుపెట్టారు.

సంగారెడ్డి, వెలుగు: కరోనా ఎఫెక్ట్ ‌‌రాష్ట్రంలోని చిన్నాపెద్ద ఫ్యాక్ట‌రీలపై పడింది. లాక్‌‌డౌన్ ‌‌వల్ల సొంతూర్ల‌కు పోయిన వలస కార్మికులు తిరిగి రాకపోవడంతో పని చేసేటోళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. రెండింతలు జీతాలు ఇస్తామని లోకల్ ‌‌జనాలకు చెప్పినా.. వాళ్లు కరోనా భయంతో రాకపోవడంతో ఉత్పత్తి ఆగి నష్టపోతున్నాయి. పటాన్ ‌చెరు ఇండస్ట్రియల్ ‌‌బెల్ట్ ‌‌పరిధిలోనే 20 వేల జాబ్స్ ‌‌ఖాళీగా ఉన్నాయి. ఏ ఫ్యాక్ట‌రీ దగ్గర చూసినా ‘వాంటెడ్ ‌లేబర్‌’ బోర్డులు కనబడుతున్నాయి. పటాన్‌‌చెరు ఇండస్ట్రియల్ బెల్ట్ ప‌రిధిలో 4 వేల సూక్ష్మ, చిన్న, భారీ పరిశ్రమలున్నాయి. చిన్న ఫ్యాక్ట‌రీలు సుమారు 2,800.. భారీవి 1,200 వరకు ఉంటాయి.

ఇదివరకు లక్ష మందికి పైగా కార్మికులు వీటిల్లో పని చేసేవారు. వీళ్ల‌లో 70 శాతం మంది వలస కార్మికులే ఉన్నారు. లాక్‌‌డౌన్ వల్ల వాళ్లంతా సొంతూర్ల‌కు వెళ్లిపోవడంతో చిన్న పరిశ్రమలు చాలా వరకు ఆగిపోయాయి. స్థానిక యువతకు ఎక్కువ జీతం ఇస్తామన్నా కరోనా భయంతో పనికి ముందుకు రావట్లేదు. పటాన్‌‌చెరుతో పాటు సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, పాశమైలారం, గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, జహీరాబాద్, సదాశివపేట, హత్నూరు పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో అన్ని ఫ్యాక్ట‌రీల‌ దగ్గర ‘వాంటెడ్ లేబర్’ బోర్డులే కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు మూసేయాల్సిందేనని చిన్న పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

సర్కారు పట్టించుకుంటలేదు

లాక్‌‌డౌన్‌‌టైమ్‌‌లో ఫిక్స్‌‌డ్ కరెంటు బిల్లులతో పరిశ్రమలు ఇప్పటికే నష్టపోయాయి. కార్మికుల కొరత ఉన్నా 30 శాతం ఉత్పత్తితో యాజమాన్యాలు నెట్టు కొస్తున్నాయి. ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నాయి. పరిశ్రమలను ఆదుకోవడానికి 3 నెలల ఫిక్స్‌‌డ్ కరెంట్ బిల్లులు మాఫీ చేయాలంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పారిశ్రామికవేత్తలు అంటున్నారు.

లేబర్‌నుపిలిపించండి
ఇటీవల పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఓ చెప్పుల పరిశ్రమ యాజమాన్యం జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్ల‌బోసుకుంది. ఫ్యాక్ట‌రీలో కార్మికులు లేక ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పడంతో చత్తీస్‌గఢ్‌ నుంచి వంద మంది కార్మికులను పిలిపించినట్టు తెలిసింది. దీంతో సొంతూర్ల‌కు పోయిన వలస కార్మికులను తిరిగి పిలిపించాలని ఫ్యాక్ట‌రీస్ అసోసియేషన్ తరపున  జిల్లా పోలీసు యంత్రాంగాన్నికోరుతున్నారు. మరోవైపు పరిశ్రమల్లో ఉత్పత్తి సంక్షోభాన్ని తగ్గించేందుకు టీఎస్ఐఐసీ సొసైటీలు వాట్సాప్ నంబర్లు ఇచ్చి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోమంటున్నా స్థానిక యువకులు కరోనా భయంతో ముందుకు రావడం లేదు. ప్రస్తుతం పారిశ్రామికవాడలో 20 వేల ఉద్యోగాలు కాళీగా ఉన్న‌ట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం