2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వాళ్ల నియామకాలను రద్దు చేయాలని ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది హై కోర్టు డివిజన్ బెంచ్.
2015 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్ సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ(నవంబర్ 27) విచారణ చేపట్టిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది .
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 అక్టోబర్24న విడుదల చేసిన 2015 గ్రూప్- 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు నవంబర్ 18 సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వైట్‌నర్ వినియోగం, దిద్దుబాట్లు ఉన్న పార్ట్ -బీ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సీకి లేదని పేర్కొంది. ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది.
2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. సాంకేతిక కమిటీ సిఫారసులు, హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో పూర్తి చేయాలని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై టీజీపీఎస్ సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
