రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా

రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా
  • సెప్టెంబర్ మొదటి వారంకల్లా మరో 29,700 టన్నులు.. తీరనున్న రైతుల కష్టాలు
  • వచ్చే నెలలో అదనపు యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్​
  • పెండింగ్​ పెట్టిన  2.38 లక్షల టన్నులను ఈ నెలలోనే  సరఫరా చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కేంద్రం తాజాగా ప్రకటించిన కోటాలో  21,325  టన్నుల యూరియా ఒకటి, రెండురోజుల్లో రాష్ట్రానికి చేరుకోనున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో మరో 29,700 టన్నుల యూరియా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల ద్వారా వచ్చే అవకాశమున్నది. దీంతో రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయి.  ఒకటి రెండు రోజుల్లో ఇఫ్కో, ఫుల్‌‌‌‌పూర్, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్, ఎంసీఎఫ్‌‌‌‌ఎల్, క్రిబ్‌‌‌‌కో, సీఐఎల్, పీపీఎల్ కంపెనీల నుంచి వచ్చే 21,325 టన్నుల యూరియా గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుంటుంది.

 అక్కడి నుంచి జిల్లాల డిమాండ్‌‌‌‌కు తగ్గట్టుగా సరఫరా చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఐపీఎల్, సీఐఎల్ కంపెనీల నుంచి దామ్ర, గంగవరం, కరాయికల్ పోర్టుల ద్వారా వచ్చే 27,950 టన్నుల యూరియా.. ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్‌నగర్, గజ్వేల్, జగిత్యాల, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు సరఫరా కానున్నది.

రోజుకు 9 వేల టన్నులకు పైగా అమ్మకాలు..

ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తమ వరి పొలాలకు మొదటి, రెండో విడత యూరియా చల్లుతున్నారు. త్వరలో మూడో విడతతోపాటు పంటలకు పొటాషియం (ఎంఓపీ) వాడకం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో వరి పొలాలకే 2.81 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్రం నుంచి 2.38 లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం  తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల టన్నుల యూరియా స్టాక్​ ఉండగా, రోజుకు 9 వేల నుంచి 11 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల లెటర్​

వచ్చే నెలలో రైతుల అవసరాలు తీర్చేందుకు తక్షణమే అదనపు యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు శుక్రవారం లెటర్​ రాశారు.  సెప్టెంబర్​ కోటా1.50 లక్షల టన్నులకు తోడు పెండింగ్​పెట్టిన  2.38 లక్షల టన్నుల యూరియాను ఈ నెలలోనే  సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

  కాకినాడ పోర్టుకు చేరనున్న ఐబీఈ లోటర్ నౌకలోని 47,500 టన్నులు, గంగవరం పోర్టుకు చేరనున్న ఎంవీ ఏఎం ఓషన్ ఫ్రైట్ (45,000 టన్నులు), మగ్దా (44,000 టన్నులు) నౌకల నుంచి 20 వేల టన్నుల చొప్పున రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. అలా చేస్తేనే రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.