
- వారంపాటు పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీసీసీ చీఫ్ల నియామకం కోసం ఏఐసీసీ నియమించిన 22 మంది అబ్జర్వర్లు శనివారం రాష్ట్రానికి చేరుకున్నారు. అనంతరం నేరుగా వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లారు. ఒక్కో అబ్జర్వర్ కు చిన్న జిల్లాలైతే రెండు చొప్పున, ఒక్కో పెద్ద జిల్లాకు ఒక అబ్జర్వర్ ను కేటాయించారు. వారు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ఆ జిల్లాలోని పార్టీ కీలక నేతలను, పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలిసి డీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలను తెలుసుకుంటారు.
స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సామాజిక వర్గాల వారీగా మూడు నుంచి ఐదు పేర్లను డీసీసీ చీఫ్ పదవికి హైకమాండ్ కు సిఫారసు చేయనున్నారు. ఇందులో పార్టీకి విధేయత, సీనియార్టీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధన్యత ఇవ్వనున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలకు తోడు అదనంగా పార్టీ పరంగా ఉన్న మరో రెండు జిల్లాలు (సికింద్రాబాద్, ఖైరతాబాద్ ) కలిపి మొత్తం 35 జిల్లాలకు త్వరలోనే కొత్త డీసీసీ చీఫ్ లు రానున్నారు.