మెదక్, వెలుగు: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లా ఉప్లేటా తాలుకాలోని ప్రాంస్లాలో ఈ నెల25 నుంచి జనవరి 4వరకు జరిగే 'రాష్ట్ర కథా శిబిర్' కు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు వారు గైడ్ టీచర్ల ఆధ్వర్యంలో గుజరాత్ కు బయలుదేరారు. స్వామి ధర్మ బంధుజీ నేతృత్వంలో శ్రీ వేదిక్ మిషన్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కథా శిబిరంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి విద్యార్థులను కథా శిబిరానికి ఎంపిక చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 11 మంది విద్యార్థినులు, 11 మంది విద్యార్థులు, వారితో పాటు ఎస్కార్ట్గా ఒక లేడీ టీచర్, ఒక పురుష టీచర్వెళ్లారని మెదక్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ఆఫీసర్(సీఎంఓ) రాజు తెలిపారు. జాతీయ సమైఖ్యత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరమైన అంశాలతోపాటు, ఆత్మరక్షణకు సంబంధించి మార్షల్ ఆర్ట్స్, శారీరక, మానసిక వికాసానికి దోహదపడే టగ్ఆఫ్ వార్, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి క్రీడా పోటీలు, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్పై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
