- పోలీసుల అదుపులో 23 మంది ఆఫ్రికా దేశస్తులు
- వీసా గడువు ముగిసినా సిటీలోనే..
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకి పరిధిలోని పారామౌంట్ కాలనీ, ఐఏఎస్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాల్లో సోమవారం రాత్రి గోల్కొండ జోన్ పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్వివరాలను గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ మంగళవారం వెల్లడించారు. సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టామని, 10 సెర్చ్ పార్టీలు, 7 కట్ ఆఫ్ పార్టీలు, 5 లిఫ్టింగ్ పార్టీలు, 2 హోల్డింగ్ పాయింట్లు పాల్గొన్నాయన్నారు.
వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న సోమాలియా, సుడాన్, నైజీరియా, ఇథియోపియా దేశాలకు చెందిన 23 మంది విదేశీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సరైన పత్రాలు లేని 30 బైక్లు, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు (3 పెద్దవి, 6 చిన్నవి), నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 53 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మరిన్ని తనిఖీలు కొనసాగుతాయని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ జి. చంద్రమోహన్ తెలిపారు.
