ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం : గంటకో పిల్లోడు చొప్పున చనిపోతున్నారు..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం : గంటకో పిల్లోడు చొప్పున చనిపోతున్నారు..

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేరోజు 24 మంది చనిపోయారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. ‘‘గడిచిన 24 గంటల వ్యవధిలో ఆసుపత్రిలో 24 మంది చనిపోయారు. వీరిలో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. 

మృతుల్లో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ శిశువులు ఉన్నారు” అని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ(జీఎంసీహెచ్) డీన్‌ శంకర్‌రావు చవాన్‌ వెల్లడించారు. మిగతా 12 మంది పలు వ్యాధులు, పాముకాటుతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, బడ్జెట్‌ కొరత ఉందని చెప్పారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు. 

మరో 70 మంది పరిస్థితి సీరియస్: మాజీ సీఎం అశోక్ చవాన్

నాందేడ్ ఆసుపత్రిలో మరో 70 మంది పేషెంట్ల పరిస్థితి సీరియస్‌గా ఉందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. కొన్ని తెలియని విషపూరిత కారణాల వల్ల మరణాలు సంభవించాయని ఆసుపత్రి డీన్ చెప్పినట్లు తెలిపారు. ఆసుపత్రిలో కేవలం 500 బెడ్లు ఉన్నాయని, కానీ 1,200 మంది పేషెంట్లను అడ్మిట్ చేశారని చెప్పారు. కాగా, థానేలోని కల్వాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆగస్టు 12 - 13 తేదీల్లో 24 గంటల వ్యవధిలో 18 పేషెంట్లు చనిపోయారు.