గడువు ముగిసినా 25 లక్షల మంది టీకా తీస్కోలే

గడువు ముగిసినా 25 లక్షల మంది టీకా తీస్కోలే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గడువు ముగిసినా 25 లక్షల మంది సెకండ్ డోసు వేయించుకోలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో పది లక్షల మంది కొవాగ్జిన్, 15 లక్షల మంది కొవిషీల్డ్ తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైనా వారంతా సెకండ్ డోసు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా  అదుపులోకి వచ్చిందని ఆయన ప్రకటించారు. థర్డ్ వేవ్ సూచనలు కనిపించడం లేదన్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్​ పండుగల నేపథ్యంలో ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఈ మూడు నెలల్లో థర్డ్ వేవ్ రాకపోతే, ఇక కరోనా ఖతమైనట్టేనని ఆయన కామెంట్‌‌ చేశారు. ప్రస్తుతం పాండెమిక్ స్టేజ్ నుంచి ఎండెమిక్‌‌ స్టేజ్‌‌లోకి కరోనా వెళ్తోందన్నారు. ఎండెమిక్ అంటే.. స్వైన్‌‌ఫ్లూ తరహాలో అక్కడక్కడా కేసులు రావడమే తప్ప, ఒకేసారి వేలు, లక్షల మందికి వైరస్ సోకే అవకాశం ఉండకపోవచ్చని శ్రీనివాసరావు చెప్పారు. బలమైన వేరియంట్ వస్తే మాత్రం వైరస్ విజృంభించే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్ వేయించుకుని ఎవరి పనులు వారు చేసుకోవచ్చని తెలిపారు. కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, రోజూ ఒకరిద్దరు వైరస్‌‌కు బలవుతున్నారని డీహెచ్‌‌ వెల్లడించారు. 17 ఏండ్ల అమ్మాయి ఇటీవల కరోనాతో చనిపోయిందని, మరో ఇద్దరు యూత్‌‌ కూడా మరణించారని చెప్పారు. అందుకే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నామన్నారు.

30 లక్షల డోసులు..

 ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అడిగినన్ని డోసులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని డీహెచ్ తెలిపారు. ప్రతి సెంటర్‌‌‌‌లోనూ రెండు రకాల (కొవాగ్జిన్, కొవిషీల్డ్) వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్‌‌ సెంటర్‌‌‌‌కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. టీకా రెండు డోసులు తీసుకుంటేనే యాంటీబాడీ ప్రొటెక్షన్ లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 27.9 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 44.1 శాతం మంది సింగిల్ డోసు వేసుకున్నారని డీహెచ్ చెప్పారు. 28 శాతం మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదన్నారు. పిల్లలకు కూడా త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

పరిహారం గైడ్‌‌లైన్స్‌‌ ఇంకా రాలే

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారంపై కేంద్రం నుంచి ఇంకా గైడ్‌‌లైన్స్ రాలేదని డీహెచ్ తెలిపారు. గైడ్‌‌లైన్స్‌‌కు అనుగుణంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

183 కేసులు.. ఇద్దరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 183 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సోమవారం ప్రకటించింది. ఆదివారం 40,354 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌‌లో 53 మందికి, జిల్లాల్లో130 మందికి పాజిటివ్‌‌ వచ్చిందని పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,070కి చేరగా, ఇందులో 6,59,942 మంది కోలుకున్నట్టుగా చూపించింది. ఇంకో 4,196 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇందులో 1,820 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వాళ్లు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. కరోనాతో ఆదివారం మరో ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య 3,932కి పెరిగిందని బులెటిన్‌‌లో చూపించింది.