రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 22మంది సజీవదహనం

రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 22మంది సజీవదహనం

గుజరాత్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్‌ జోన్‌లో మే 25వ తేదీ శనివారం ప్రమాదవశాత్తు  మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో చిన్నపిల్లలతోపాటు చాలా మంది వ్యక్తులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో దాదాపు 22మంది సజీవదహనమయ్యారని.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగై వైద్యం అందించాలని సూచించారు.