బీసీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలె : ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

బీసీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలె : ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

జమ్మికుంట, వెలుగు : సమాజంలో 52 శాతం ఉన్న బీసీ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్​ కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ డిమాండ్​ చేశారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా జమ్మికుంట పట్టణంలో గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రవీణ్​కుమార్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వందల కోట్లు సంపాదించారన్నారు. కానీ శ్రమను నమ్ముకుని, నీతి, నిజాయతీతో పనిచేస్తున్న గౌడకులస్తులు మాత్రం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదన్నారు. గౌడ కులస్తులకు రాష్ట్ర బడ్జెట్​లో 8 శాతం వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయానికి కేసీఆర్​ రూ. 1,200 కోట్లు ఇచ్చారని, అదేవిధంగా మల్లన్న దేవాలయాలు, రేణుక ఎల్లమ్మ క్షేత్రాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు.

వైన్​ షాపులలో గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్​ పెట్టి, డిపాజిట్​ పేరుతో లక్షలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్​ ఉందన్నారు. గౌడ కులస్తులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గీతబంధు ప్రకటించాలని, మద్యం షాపుల్లో 50 శాతం రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​చేశారు. జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెట్టాలని గుర్తు చేశారు. ఇటీవల హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్​ను అరెస్టు చేసిన ప్రభుత్వం, దళిత బహుజన ఆదివాసీ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై చిన్నజీయర్​స్వామి, రాంగోపాల్​వర్మ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌడ కులస్తుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివగౌడ్, సంజయ్​, విశ్వం, రవి, మహిళా కన్వీనర్​శిరీష్​, స్వప్న గౌడ్, నరేశ్​తదితరులు పాల్గొన్నారు.