ఒక్కరోజే 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ

ఒక్కరోజే 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ
  •  మరో వెయ్యి మంది పండిట్, పీఈటీలు కూడా 
  • కొత్త స్కూళ్లకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన విద్యాశాఖ 
  • రంగారెడ్డి మినహా రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ పూర్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూల్ టీచర్ల బదిలీల ప్రక్రియ చివరి దశకు చేరింది. రంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ మినహా అన్ని జిల్లాల్లో బదిలీల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 45 వేల మంది టీచర్లు బదిలీ అయ్యారు. వారందరికీ కొత్త స్కూళ్లను అలాట్ చేశారు. గత సర్కారు హయాంలోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, కోర్టు కేసు నేపథ్యంలో మధ్యలోనే ఈ ప్రాసెస్ ఆగిపోయింది. 

అప్పటికే సుమారు 12,500 మంది టీచర్లకు బదిలీలు జరిగాయి. తాజాగా కోర్టు కేసులు క్లియర్ కావడంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కారు వచ్చాక మళ్లీ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మల్టీజోన్ 2 పరిధిలోని 12 జిల్లాల్లో ఇటీవల 5,962 మంది టీచర్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 26,108 మంది టీచర్లకు బదిలీలు జరిగాయి.

 వీరిలో 25,038 మంది ఎస్జీటీలు ఉండగా, మరో 1,070 మంది పండిట్, పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 1,436 మంది, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 1,323 మంది, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 1,299 మంది, ఖమ్మంలో 1,122 మంది ఉండగా, అత్యల్పంగా ములుగులో 271 మంది, హనుమకొండలో 320, జయశంకర్ జిల్లాలో 333 మంది బదిలీ అయ్యారు. 

మరోపక్క రంగారెడ్డి జిల్లాలోనూ సోమవారం 985 మంది స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌‌‌‌‌‌‌‌ఏ) బదిలీలు జరిగాయి. వారందరికీ కొత్త స్కూళ్లు అలాట్ చేశారు. దీంతో చాలామంది కొత్త బడుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ప్రక్రియ ప్రారంభం కానున్నది. అది పూర్తికాగానే, ఎస్జీటీలకు బదిలీలు జరగనున్నాయి. కాగా, ఇప్పటికే 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు లభించిన విషయం తెలిసిందే.

అందరినీ రిలీవ్ చేయట్లే..

ఎస్జీటీల బదిలీలు జరిగినా విద్యా శాఖ అధికారులు మాత్రం అందరినీ రిలీవ్ చేయడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాత, కొత్త స్కూళ్లలో టీచర్ల సంఖ్యను పరిశీలించిన తర్వాతే రిలీవ్ చేస్తున్నారు. సోమవారం 26 వేల మంది టీచర్లకు బదిలీలు జరిగితే.. సగం మందిని పాత బడుల్లోనే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కువ రిమోట్ ఏరియాలోని స్కూళ్లే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ స్కూళ్లకు టీచర్లు బదిలీపై రాకపోవడంతో, పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. 

 కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారుల నిర్ణయాన్ని టీచర్ల సంఘాలు తప్పుబడుతున్నాయి. బదిలీ అయిన టీచర్లందరినీ రిలీవ్ చేయాలని, ఖాళీగా ఉండే పోస్టుల్లో విద్యా వాలంటీర్లను తీసుకోవాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు.