
హర్యానాలో దారుణం జరిగింది. మెడిసిన్ కోసం బయటకు వెళ్లిన యువకుడిని కొంతమంది దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన నుహ్ జిల్లాలోని మేవాట్ ప్రాంతంలో జరిగింది. ఆసిఫ్ ఖాన్ అనే 25 ఏళ్ల యువకుడు జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఆసిఫ్ తన ఇంట్లో వాళ్లకోసం మందులు తేవడానికి తన కజిన్ బ్రదర్స్‌తో కలిసి సోహ్నకు బయలుదేరాడు. వీరు మార్గమధ్యలో ఉండగా.. కొంతమంది దుండగులు కర్రలు, రాడ్లతో వీరిపై దాడికి పాల్పడ్డారు. ఆసిఫ్ ఖాన్ కాళ్లు, చేతులు విరగ్గొట్టి హత్యచేశారు. ఈ ఘటనలో ఆసిఫ్ కజిన్స్‌కు తీవ్రగాయాలయ్యాయి.
కాగా.. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గుర్గావ్-అల్వార్ రహదారిపై బైటాయించారు. మృతుని బంధువుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై స్థానికులు రాళ్లు రువ్వారు.
తమ కొడుకుని కొంతమంది వ్యక్తులు కావాలనే కొట్టిచంపారని మృతుని తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో 12 మంది పాల్గొన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానితులలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా వారికోసం గాలింపు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.