ఒడిశాలో పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు

ఒడిశాలో పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు

రోజుకో వైరస్, రోజుకో కొత్త వ్యాధి ప్రపంచాన్ని కలవరం పెట్టడం షరా మామూలైపోయింది. మొన్నటివరకూ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూలాంటి వైపరీత్యాలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్న జనాన్ని మరో కొత్త వైరస్ వణికిస్తోంది. అదే టొమాటో వైరస్. దీని కారణంగా తాజాగా ఒడిశాలో 26 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటికే కేరళలో 80 కేసులు నమోదు కాగా... చిన్న పిల్లల్లోనే అధికంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలతో పోలిస్తే పెద్దవారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్లే ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో వస్తున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. 

ఇకపోతే తాజాగా ఒడిశాలో 36 సాంపిల్స్ ను వైద్యులు పరీక్షించగా.. అందులో 26 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకినట్లు ధ్రువీకరించారు. వారంతా క్షేమంగానే ఉన్నారనీ, భయపడాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా టొమాటో ఫ్లూ వచ్చిన పిల్లల్లో ఎక్కువగా జ్వరం, నోటిలో నొప్పులతో కూడుకున్న పుండ్లు ఏర్పడడం, చేతులు, కాళ్లపై బొబ్బలు రావడాన్ని గమనించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

టొమాటో పేరే ఎందుకు.. ?

టొమాటో వైరస్ అంటే టమాటా తింటే రాదండోయ్.  పిల్లల్లో ఎక్కువగా ఈ వచ్చే వ్యాధి కారణంగా ఎరుపు రంగులో పుండ్లు, దద్దుర్లు, బొబ్బలు రావడం వల్లే ఈ వ్యాధికి టొమాటో ఫ్లూ అని పేరు పెట్టినట్టు సమాచారం.