నెలకు కోటి లెక్కన.. తాగి మరీ ఫైన్స్ కడుతున్నారు .. పోలీస్ శాఖకు మస్త్ ఆదాయం ఇస్తున్న మందు ప్రియులు

నెలకు కోటి లెక్కన.. తాగి మరీ ఫైన్స్ కడుతున్నారు .. పోలీస్ శాఖకు మస్త్ ఆదాయం ఇస్తున్న మందు ప్రియులు


ఏప్రిల్ నెలలో నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 2,687 మందికి రూ. 35 లక్షల  90 వేల 500 జరిమానా విధించినట్లుగా  ట్రాఫిక్‌ చీఫ్‌  జి.సుధీర్‌బాబు  తెలిపారు.  ఈ ఏడాదిలో ఏప్రిల్‌ వరకు  మొత్తం  13 వేల 429 మంది నుంచి మూడు  కోట్ల 21 లక్షల 39 వేల 060 రూపాయల జరిమానా వసూలు చేశారు పోలీసులు. వీరిపై ట్రాఫిక్‌ పోలీసులు న్యాయస్థానంలో 1,717 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.  

వీరికి కోర్టు రూ.35,90,500 జరిమానా విధించింది. ఇందులో  1317 మందికి కోర్టు  జైలు శిక్ష కూడా విధించగా,  243 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది.  నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి వాహనాలు నడపటం కూడా ఓ కారణమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు డ్రంక్‌ డ్రైవింగ్‌పై దాదాపు ప్రతి రాత్రి స్పెషల్‌డ్రైవ్స్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌పై 2,30,974, త్రిపుల్‌ రైడింగ్‌పై 51,383, ఆర్టీసీ బస్సులపై 8587, హెవీ వాహనాలపై 7841 చలాన్లు జారీ చేశారు. నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న 42,273 వాహనాలపై చలాన్లు విధించిన ట్రాఫిక్‌ పోలీసులు 282 వాహనాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. అద్దాలపై బ్లాక్‌ ఫిల్ములున్న 9199 కార్లు, అక్రమంగా సైరన్లు వినియోగిస్తున్న 1600 వాహనాలపై చర్యలు తీసుకున్నారు.

ఇక ఆపరేషన్‌ రోప్‌ లో భాగంగా నగరంలో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి ఏప్రిల్‌లో అక్రమంగా సైరన్‌లు వినియోగించిన 1019 మందిపై,  ఈ ఏడాది మొత్తంగా 1600 మందిపై కేసులు నమోదు చేశామని  పోలీసులు  వెల్లడించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చునని,అందుకు కఠిన చర్యలు తీసుకుంటామని  సిటీ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.   మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని,  ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా  పాటించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరుతున్నారు.