న్యూ ఇయర్ రోజు మందు తాగి దొరికిన 270 మందికి జైలు : చర్యలు తీసుకోవాలని ఆఫీసులకు లెటర్లు

న్యూ ఇయర్ రోజు మందు తాగి దొరికిన 270 మందికి జైలు : చర్యలు తీసుకోవాలని ఆఫీసులకు లెటర్లు

అన్నంత పని చేశారు ట్రాఫిక్ పోలీసులు.. వార్నింగ్ ఇచ్చి లైట్ తీసుకుంటారులే.. న్యూ ఇయర్ రోజు ఎందుకు పట్టుకుంటారు అనుకున్న మందుబాబులకు షాక్ ఇచ్చారు. ఆ విషయాన్ని అంతటితో వదల్లేదు.. న్యూ ఇయర్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందు ప్రియులను జైలుకు తరలించారు. ఒకరా ఇద్దరా అని కాదు.. 100.. 200 కూడా కాదు.. ఏకంగా 270 మంది మందు ప్రియులను జైలుకు పంపించారు. అంతేనా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి.. జైలుకు వెళ్లిన వారి వివరాలను వారు వారు పని చేస్తున్న విద్యా సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు లేఖల ద్వారా తెలియజేశారు.

 నూతన సంవత్సరం-2026 వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో దొరికిన 270 మందికి జైలు శిక్ష పడిందని సిటీ ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు.  డిసెంబర్ 24  నుంచి డిసెంబర్ 31  వరకు సిటీ పరిధిలో  ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరు పరిచామన్నారు. దీంతో 270 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందన్నారు. అలాగే వారు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు, చదువుతున్న విద్యాసంస్థలకు లెటర్లు రాసి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

ఇప్పుడు ఈ విషయం హైదరాబాద్ సిటీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మందు తాగి.. ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్లు మారటమే కాదు.. సమాజంలో చెడ్డపేరు తెచ్చుకోవటం ఎందుకు అనే ఆలోచన మందు ప్రియుల్లో తీసుకొస్తున్నారు పోలీసులు. మందు తాగటం నేరం కాదు.. మందు తాగి డ్రైవింగ్ చేయటం నేరం అనే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తున్నారు. మందు తాగండి.. ఇంట్లో తాగండి.. మరెక్కడైనా తాగండి.. అంతేకానీ మందు తాగి రోడ్లపైకి రావొద్దంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు పోలీసులు. 

2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 270 మందికి జైలు శిక్షతోపాటు.. అంతకు మించి మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఉన్న ఈ శిక్షలతో అయినా మారతారో లేదో చూడాలి.