ములుగు పైలట్ ప్రోగ్రామ్ లో బట్టబయలైన ధరణి లోపాలు

ములుగు పైలట్ ప్రోగ్రామ్ లో బట్టబయలైన ధరణి లోపాలు
  • ములుగు పైలట్ ​ప్రోగ్రామ్​లో బట్టబయలైన లోపాలు
  • సమస్యలే లేవని సర్కార్ చెప్తున్నదంతా ఉత్తిమాటే
  • ములుగులో 11 రోజుల్లోనే భారీగా అప్లికేషన్లు.. వాటిలో పరిష్కరించే 
  • చాన్స్ లేక పక్కన పెట్టినవి  132
  • ఈ లెక్కన రాష్ట్రమంతా 20 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం
  • సమగ్ర భూసర్వే, గ్రామ సభలు, రెవెన్యూ కోర్టులే పరిష్కారమంటున్న రెవెన్యూ నిపుణులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల కింద చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన లోపాలు శాపాలై రైతులను వెంటాడుతున్నాయి. ధరణి పోర్టల్​తో అన్ని రకాల భూసమస్యలు పరిష్కారమయ్యాయని సర్కార్ పెద్దలు చెప్తున్నప్పటికీ.. ఒక్కో ఊరిలో వందల్లో సమస్యలు రిపోర్ట్ అవుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో భూసమస్యల పరిష్కారం కోసం పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన ఒక్క ములుగు గ్రామంలోనే 272 అర్జీలు రావడం భూరికార్డుల ప్రక్షాళనలో లోపాలు, ధరణి పోర్టల్ నిర్వహణ తీరుకు అద్దం పడుతున్నది. ఈ లెక్కన ఒక్క గ్రామంలోనే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. రాష్ట్రంలోని 12,762 గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ మొదలుపెడితే అప్లికేషన్ల సంఖ్య 20 లక్షలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుకో తీరుగా, ఊరికో రకంగా భూసమస్యలు ఉన్నాయి. సమగ్ర భూసర్వే, గ్రామ సభలు, రెవెన్యూ కోర్టుల నిర్వహణతోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు.

ధరణి పోర్టల్​లోని లోపాలతో రైతులు పడుతున్న కష్టాలను సిద్దిపేట జిల్లా ములుగులో ఈ నెల 14న చేపట్టిన పైలట్ ప్రోగ్రామ్ బయటపెట్టింది. భూరికార్డుల సవరణకు ధరణిలో మాడ్యూల్స్​ లేకపోవడం, ఆఫీసర్లు చేసిన తప్పులను సరిదిద్దే అవకాశం లేక రైతులు తిప్పలు పడుతున్నట్లు తేలింది. ఒక్క ములుగు గ్రామంలోనే రైతుల నుంచి 272 అప్లికేషన్లు రాగా.. అందులో కలెక్టర్ స్థాయిలోనూ పరిష్కరించలేని దరఖాస్తులు ఏకంగా 132 ఉన్నాయి. అంటే సగం సమస్యలకు ధరణిలో పరిష్కరించే మెకానిజం లేదు.  ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన కొత్త మాడ్యూల్స్ తెస్తే తప్ప రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే చాన్స్ లేదని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. 

14న ప్రత్యేక సమావేశం పెట్టి.. 

ధరణిలోని లోపాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధరణి పోర్టల్​లో చేర్చాల్సిన మాడ్యూల్స్​పై   మంత్రి హరీశ్​రావు  నేతృత్వంలోని కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగును పైలట్​ ప్రాజెక్టుగా సర్కారు ఎంపిక చేసింది. ఈ క్రమంలో జూన్14న  మంత్రి హరీశ్​రావు, సీఎస్ సోమేశ్​ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, అధికారులు శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీఎస్ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొందరు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి.

కొత్త మాడ్యుల్స్ అందుబాటులోకి వస్తేనే.. 

ధరణి వచ్చాక రైతులకు ఎలాంటి సమస్యలు లేవని మొదట్లో మభ్యపెట్టిన సర్కారు.. ఏడాది తర్వాతగానీ కండ్లు తెరవలేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వేల కొద్దీ ఫిర్యాదులు రావడంతో ధరణిలో సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలను సూచించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు చైర్మన్ గా  కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా 40 రకాలకు పైగా సమస్యలు సబ్ కమిటీ దృష్టికి వచ్చాయి. వీటి పరిష్కారం కోసం తొలుత ఏడు మాడ్యూల్స్ రెడీ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ధరణిలో ఆప్షన్లు లేకపోవడంతో కలెక్టర్లు, తహసీల్దార్లు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తాజాగా ములుగులోనూ ఇలాంటి సమస్యలే వెలుగుచూడడంతో సర్కారు కొత్త మాడ్యూల్స్​  తెచ్చే ప్రక్రియను స్పీడప్  చేస్తుందో లేదో చూడాలి.

11 రోజుల్లో 272 అప్లికేషన్లు

ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై  గజ్వేల్​ నియోజకవర్గ పరిధిలోని ములుగులో ఈ నెల14న ప్రారంభమైన పైలట్ ప్రోగ్రామ్ 24న ముగిసింది. ముగ్గురు  తహసీల్దార్లు, 25 మంది రెవెన్యూ  సిబ్బంది 11 రోజులు ఇక్కడే మకాం వేసి, భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. 272 మంది రైతుల నుంచి అప్లికేషన్లు రాగా.. ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్స్​ పరిధిలోని 140 అప్లికేషన్లను మీ సేవా కేంద్రాల్లో నమోదు చేయించి, కలెక్టర్ లాగిన్​కు పంపించారు. మాడ్యూల్స్ లేని 132 అప్లికేషన్లను కలెక్టర్ స్థాయిలోనూ పరిష్కరించే అవకాశం లేకపోవడంతో ఉన్నతాధికారులకు పంపారు. 

20 రకాలకు పైగా సమస్యలు

ధరణి పోర్టల్​లోని  లోపాల వల్ల ములుగు గ్రామంలోని రైతులు 20 రకాలకు పైగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారిపోవడం, సర్వే నంబర్లు తారుమారు కావడం, పట్టా సర్టిఫికెట్లలో తప్పులు, ఏ సమస్యలేని భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో పడడం,  ఒకే పేరుగల ఇద్దరు వ్యక్తుల భూములు అటు ఇటు పడడం, ఆధార్ నంబర్లు తప్పుగా రావడం, ఫౌతిలో ఇబ్బందులు, ఖాతా టు ఖాతా ట్రాన్స్​ఫర్ లేకపోవడం లాంటి సమస్యలు వెలుగుచూశాయి. వాటి పరిష్కారం కోసం రైతులు కొన్ని నెలలుగా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ధరణి పోర్టల్​లో  మాడ్యూల్స్ లేకపోవడంతో కలెక్టర్ స్థాయిలో కూడా పరిష్కారం కావడంలేదు. 

సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన తీగుళ్ల సత్తయ్య తండ్రి తీగుళ్ల భూమయ్య పేరు మీద సర్వే నంబర్ 97/100 లో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరో తీగుళ్ల భూమయ్య (తండ్రి ముత్తయ్య) పేరు మీద పొరపాటున నమోదుచేశారు. ఈ పొరపాటును సరిదిద్దాక ధరణి పోర్టల్ లో ఎంటర్​ చేయాల్సిన ఆఫీసర్లు, పాత రికార్డుల ప్రకారమే నమోదుచేశారు. ఈలోగా సత్తయ్య తండ్రి భూమయ్య చనిపోవడంతో తన పేరు మీదికి ఫౌతీ చేయాలని సత్తయ్య అప్లికేషన్​ పెట్టుకున్నాడు. కానీ, దీనిని మార్చే మాడ్యూల్ లేక పోవడంతో తహసీల్దార్​ ఆఫీసు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నాడు. క్షేత్ర స్థాయిలో జరిగిన పొరపాటును అధికారులు గుర్తించినా ధరణి పోర్టల్​లో సవరించే అవకాశం లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఈ పొరపాటును సరిదిద్దాలని తీగుళ్ల సత్తయ్య తాజాగా మరోసారి అప్లికేషన్​ పెట్టుకున్నాడు.