- కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా దాడులతో ఉద్రిక్తతలు
- హెజ్బొల్లా ఎదురుదాడిలో నలుగురు సోల్జర్లు మృతి
- ఇజ్రాయెల్ దాడులతో అమెరికా, ఇరాన్ చర్చలు వాయిదా
- శాంతి ఒప్పందం భవితవ్యంపై ఆందోళనలు
జెరూసలెం/బీరుట్: అమెరికా, ఇరాన్ దేశాలు లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ముగించాలని అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత కూడా లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ దళాలపై దాడులకు దిగడంతో లెబనాన్‌లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరిపిన వరుస వైమానిక దాడుల్లో 28 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని లెబనాన్ అధికారిక వార్తా సంస్థ ‘నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఎన్ఎన్ఏ)’ వెల్లడించింది. నబతియా జిల్లా అల్-షర్కియా, హరూఫ్, కఫర్ సిర్ పట్టణాల్లోని నివాస గృహాలు లక్ష్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ దాడులు చేసిందని, ఈ దాడుల్లో అనేక మందికి గాయాలు కాగా, పలువురు గల్లంతు అయ్యారని తెలిపింది.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం, మార్చి 2 నుంచి లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడిలో 3,912 మంది మరణించగా, 11,873 మంది గాయపడ్డారని.. పది లక్షల కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారని ఎన్ఎన్ఏ పేర్కొంది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా జరిపిన దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం, స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించాయి. దక్షిణ లెబనాన్ గ్రామం కఫర్ టెబ్నిట్‌లో రాత్రి వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంకుపై హెజ్బొల్లా యాంటీ ట్యాంక్ డ్రోన్‌తో ఈ దాడి చేసిందని, ఈ దాడిలో మరణించినవారిలో బెటాలియన్ కమాండర్, మరో ముగ్గురు ఉన్నారని తెలిపాయి.
చర్చల నుంచి వెనక్కి తగ్గిన ఇరాన్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తుండటంతో, కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు జరగాల్సిన చర్చల నుంచి ఇరాన్ వెనక్కి తగ్గింది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక నిబంధనలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు ముందుకు సాగడం లేదని స్విస్ విదేశాంగ శాఖ శుక్రవారం ధృవీకరించింది. ఈ వాయిదా కారణంగా, అమెరికా, ఇరాన్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అప్పుడే నీరుగారిపోతుందేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. ఎలాంటి చర్చలైనా టెహ్రాన్ రెడ్ లైన్స్(లక్ష్మణ రేఖల)కు లోబడి ఉంటాయని చెప్పారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయడం చర్చల్లో ఇరాన్ ప్రధాన డిమాండ్లలో ఒకటి అని స్పష్టం చేశారు. అయితే, ఈ ఒప్పందం స్థిరత్వంపై ఆందోళనల నేపథ్యంలో, మధ్యవర్తులుగా ఉన్న పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు ఆదివారం ఈజిప్ట్ నగరమైన అలమీన్‌లో చర్చల కోసం సమావేశం కావడానికి అంగీకరించాయని ఈజిప్ట్, పాకిస్తాన్ తెలిపాయి. మరోవైపు, అవగాహన ఒప్పందం కింద నిర్దేశించిన 60 రోజుల చర్చల టైంలో హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసిన రుసుమును మినహాయిస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది.
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య మరోసారి సీజ్ ఫైర్
లెబనాన్‌లో గురువారం రాత్రి వేళ ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన తర్వాత, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఒక సీనియర్ అమెరికా అధికారి ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపారు. ఈ కాల్పుల విరమణ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలులోకి వచ్చిందన్నారు. అమెరికా, ఖతార్ ప్రమేయంతో ఈ సీజ్ ఫైర్ కుదిరిందన్నారు. అయితే, ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య సీజ్ ఫైర్ కుదరడం, ఆ వెంటనే పరస్పరం దాడులు చేసుకోవడం తరచూ కొనసాగుతూ వస్తోంది. కాగా, హెజ్బొల్లా నుంచి ఇజ్రాయెల్ పౌరులకు ముప్పు ఉన్నంత కాలం తమ సైనిక దళాలు లెబనాన్ సరిహద్దులోని ‘బఫర్ జోన్ (రక్షిత ప్రాంతం)’లోనే కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి శుక్రవారం స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూప్ వల్ల కలిగే ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ సైనిక మోహరింపు కొనసాగుతుందని, సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించుకునే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని ఆయన సంకేతాలు ఇచ్చారు.
