నాగోలులో 28 గుడిసెలు దగ్ధం

నాగోలులో 28 గుడిసెలు దగ్ధం
  • షార్ట్​సర్క్యూట్​తో చెలరేగిన మంటలు.. పేలిన 8 సిలిండర్లు
  • రోడ్డున పడ్డ కుటుంబాలు 

ఎల్బీనగర్, వెలుగు: నాగోలు సాయినగర్ కాలనీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్​సర్క్యూట్​కారణంగా చెలరేగిన మంటలు అక్కడి 28 గుడిసెలకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడి సర్వే నంబర్​96/1లోని ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మంగళవారం ఉదయం 11:15 గంటల సమయంలో గుడిసెల మీదుగా ఉన్న విద్యుత్​వైర్లు అంటుకుని మంటలు చెలరేగాయి.

గమనించిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు క్రమంగా వ్యాపించి ఓ ఇంటిలోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ ఎఫెక్ట్​తో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. స్థానికులు, నాగోలు, ఎల్బీనగర్​పోలీసులు, ఫైర్, డీఆర్ఎఫ్ ​సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ గ్యాప్​లోనే 8 గ్యాస్ సిలిండర్లు పేలాయి. గుడిసెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

బాధితులకు రూ.3వేలు చొప్పున ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ చేస్తానని తెలిపారు. సర్వం కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ తో మాట్లాడారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్యాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు ఇవ్వాలన్నారు.

ఎంపీ ఈటల రాజేందర్, నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ తో కలిసి బాధితులను పరామర్శించారు. కాగా, 2012 మార్చిలో ఇదే సాయినగర్​కాలనీలో మంటలు చెలరేగి 450 గుడిసెలు దగ్ధమ్యాయి. ఓ చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గుర్తించిన అప్పటి ప్రభుత్వం 300 మందికి పట్టాలు  అందజేసింది.