ఓటు వేసేందుకు గుడిసె వాసులకు చాన్స్ .. మళ్లీ ఓటర్ జాబితాలో చేర్చిన కంటోన్మెంట్ బోర్డు 

ఓటు వేసేందుకు గుడిసె వాసులకు చాన్స్ .. మళ్లీ ఓటర్ జాబితాలో చేర్చిన కంటోన్మెంట్ బోర్డు 

కంటోన్మెంట్, వెలుగు: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కంటోన్మెంట్​లో ఉండే 28వేల మంది గుడిసెవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునే చాన్స్ దక్కింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వీరి పేర్లను కంటోన్మెంట్ అధికారులు తాజాగా తిరిగి చేర్చారు. కంటోన్మెంట్​లోని డిఫెన్స్​ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గుడిసెలు వేసుకుని,  కొన్ని ప్రాంతాల్లో పక్కా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నారు.  కంటోన్మెంట్​చట్టాన్ని ఉల్లంఘించారని బోర్డు అధికారులు గుడిసె వాసులను పంపేందుకు ప్రయత్నాలు చేశారు.

దీంతో బస్తీవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  అధికారులు చివరి అస్త్రంగా ఓటరు జాబితాల నుంచి సుమారు30వేల మంది పేర్లను తొలగించారు. దీనిపై పలుమార్లు నిరసన తెలిపారు. కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికల ఓటర్ల జాబితాల సవరణలోనూ వీరిని లెక్కలోకి తీసుకోలేదు. దీనిపై అధికారులను పాలక మండలి సభ్యులు కూడా తప్పుబట్టారు. ఓటర్​ జాబితాలో పేర్లు తిరిగి చేర్చాలని ఆందోళనలు చేశారు.  

బోర్డు పాలక మండలి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తుండడం, మరోవైపు కంటోన్మెంట్​ను బల్దియాలో కలిపే ప్రక్రియ కొనసాగుతుండడంతో ఇది మరుగున పడింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ ​జారీతో రాజకీయ పార్టీలు ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలనే డిమాండ్​ను తెరపైకి తెచ్చాయి. దీంతో అధికారులు తిరిగి ఓటర్ల లిస్టులో చేర్చారు. దీంతో నవంబరు 30న కంటోన్మెంట్​ సెగ్మెంట్​లో 28వేల మందికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2,31,004 ఓటర్లు ఉండగా, ఈసారి సవరించిన ఓటరు జాబితాలో 2,46,622  మందికి పెరిగారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు బస్తీల్లో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నాయి.