సిట్ ముందుకు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

సిట్ ముందుకు  మాజీ సీఎస్ సోమేశ్  కుమార్
  • మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌‌ స్టేట్‌‌మెంట్స్ రికార్డ్‌‌ 
  • రివ్యూ కమిటీ, ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా ప్రశ్నలు
  • త్వరలో మరికొంత మంది ఉన్నతాధికారులకు నోటీసులు!

హైదరాబాద్‌‌, వెలుగు:ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేశ్​కుమార్‌‌‌‌, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌‌ నవీన్ చంద్‌‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌(ఎస్‌‌ఐటీ) విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించి రివ్యూ కమిటీ విధివిధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌(ఎస్‌‌ఐబీ) చీఫ్‌‌గా ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్‌‌‌‌ 1 నుంచి 15 వ తేదీ వరకు ట్యాపింగ్‌‌ చేసిన 618 నంబర్ల వివరాలతో ప్రశ్నించినట్టు తెలిసింది.  ఫోన్‌‌ ట్యాపింగ్‌‌పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్‌‌ ఫైల్‌‌కు సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్​మెంట్లు రికార్డ్‌‌ చేసినట్టు సమాచారం.

నవీన్​చంద్‌‌ చీఫ్‌‌గా ప్రభాకర్ రావుకు ఆదేశాలు

 సోమేశ్ కుమార్‌‌‌‌, నవీన్‌‌ చంద్‌‌ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్‌‌ దూకుడు పెంచింది. ప్రధానంగా సోమేశ్ కుమార్ సీఎస్‌‌గా బాధ్యతలు నిర్వహించిన 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య కాలంలో జరిగిన ఫోన్‌‌ట్యాపింగ్‌‌ వ్యవహారంపై సిట్‌‌ స్పెషల్ ఫోకస్‌‌ పెట్టినట్టు సమాచారం.

వీరిద్దరూ ప్రభాకర్ రావు బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారనే వివరాలను సేకరించినట్టు తెలిసింది. నవీన్‌చంద్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేశారు. అదే సమయంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులను కూడా ప్రశ్నించేందుకు సిట్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కాగా నాటి హోంశాఖ సెక్రటరీ, మాజీ డీజీపీ సహా పలువురు మాజీ పోలీస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.