- చౌటుప్పల్, తుర్కపల్లి 'కాలా'ల పరిధిలో పేమెంట్
- మరో 225 నిర్వాసితుల ఫుల్ డిటైల్స్ అప్లోడ్
యాదాద్రి, వెలుగు: ట్రిపుల్ఆర్ఉత్తర భాగం నిర్వాసితులకు క్రమంగా పరిహారం అందుతోంది. గత నెలలో మొదటి విడత పరిహారం జమ చేశారు. తాజాగా రెండో విడత పరిహారం నిర్వాసితుల ఖాతాల్లో జమ అయింది. మూడో విడతకు సంబంధించిన నిర్వాసితుల డిటైల్స్ అప్లోడ్ పూర్తయింది.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. 2022లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 'కాలా'( కాంపిటెంట్, అథారిటీ ల్యాండ్ అక్విజేషన్ )లను ఏర్పాటు చేశారు.
వీటికి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు. కాగా యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందు కోసం 1795 ఎకరాలను సేకరించాల్సి ఉంది.
భువనగిరి మినహా సర్వే పూర్తి
తుర్కపల్లి 'కాలా' పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్ ఎంక్వైరీ ముగిసింది. చౌటుప్పల్ పరిధిలో కొంతమేర జరిగింది. భువనగిరి 'కాలా' పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోక పోవడంతో సర్వేతో పాటు స్టక్చర్ ఎంక్వైరీ కూడా జరగలేదు.
ఈ మండలం పరిధిలోని రైతులు, ఇంటి స్థలాలకు సంబంధించిన ఓనర్లు భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించడం, సర్వేను అడ్టుకోవడంతో ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో విడతల వారీగా పరిహారం విడుదల చేస్తోంది.
రెండో విడతలో రూ. 26.44 కోట్లు
చౌటుప్పల్ పరిధిలోని 900 మంది, తుర్కపల్లి కాలా పరిధిలోని 1589 మంది కలిపి 2489 మందిలో వెయ్యి మందికి పైగా చెందిన డిటైల్స్‌ను భూమి రాశి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. పోర్టల్‌లో అప్లోడ్ అయిన డిటైల్స్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ, జీఎం వేర్వేరుగా పరిశీలించిన అనంతరం తుర్కపల్లి కాలా పరిధిలోని నిర్వాసితులకు తొలివిడతగా గత నెలలో 49 మందికి రూ. 2.03 కోట్లు జమ చేసింది.
తాజాగా మరో 251 మంది అకౌంట్లలో రూ. 24 కోట్లు జమ చేసింది. చౌటుప్పల్ కాలా పరిధిలోని వలిగొండ మండలం పహిల్వాన్‌పురం రైతులకు పరిహారం అందింది. ఈ గ్రామంలో 111 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే 28 మంది రైతులకు చెందిన 12.15 ఎకరాలకు రూ 2.44 కోట్లు పరిహారం రిలీజ్ చేశారు. కాగా తుర్కపల్లి కాలా పరిధిలోని దాతరుపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మరో 225 మంది నిర్వాసితులకు పరిహారం అందించేందుకు నేషనల్ హైవే రెడీగా ఉంది. వీరికి చెందిన 94 ఎకరాలకు మరో రూ. 22 కోట్లు త్వరలో అందించనుంది.
తుర్కపల్లి,చౌటుప్పల్ కాలా పరిధిలోమండలాల వారీగా పరిహారం పొందిన రైతుల వివరాలు
మండలం గ్రామం రైతులు ఎకరాలు అమౌంట్(రూ.)
యాదగిరిగుట్ట దాతరుపల్లి 12 2.28 69,55,535
తుర్కపల్లి దత్తాయిపల్లి 104 46.04 8,07,54,025
తుర్కపల్లి కోనాపూర్ 54 31.17 5,35,06,432
తుర్కపల్లి ఇబ్రహీంపూర్ 33 10.07 1,25,96,392
తుర్కపల్లి వేల్పల్లి 97 58.20 10,82,59,022
చౌటుప్పల్ పహిల్వాన్‌పురం 25 12.5 2.44,10,000
