- మొత్తం 10 వేల అభ్యంతరాలు
- వార్డుల పేర్లు మార్పు
- ప్రభుత్వానికి నివేదిక అందజేత
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిని 300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేయాలన్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ మొదట కొందరు కోర్టును ఆశ్రయించడంతో రెండు రోజులు గడువు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడంతో ఇక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా, అన్ని చోట్లా కలిపి దాదాపు 10 వేల అభ్యంతరాలు, సలహాలు రాగా, ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో బల్దియా పలు మార్పులు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా 70 నుంచి 80 వార్డుల పేర్లను ప్రజలు, ప్రజాప్రతినిధులు సూచించిన విధంగానే ఉంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ప్రిలిమినరీ నోటిఫికేషన్, దానిపై స్వీకరించిన అభ్యంతరాలు, సలహాలు, కోర్టు ఆదేశాలు, అభ్యంతరాలు, సలహాలను పరిగణలోకి తీసుకుని చేసిన మార్పులతో కూడిన నివేదికను జీహెచ్ఎంసీ సోమవారం సాయంత్రమే సర్కారుకు పంపినట్లు సమాచారం.
డీడీ కాలనీ పేరు బాగ్అంబర్పేట్గా..
పునర్విభజించిన వార్డుకు డీడీ కాలనీ అని పెట్టగా, ప్రజాప్రతినిధుల అభ్యంతరం మేరకు దాని పేరును బాగ్ అంబర్ పేటగా, సికింద్రాబాద్ జోన్ లో మరో వార్డుకు మోండా మార్కెట్ గా ఇలా..సుమారు 80 వార్డుల పేర్లను మార్చేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సరిహద్దులు, జనాభా వ్యత్యాసానికి సంబంధించి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను కూడా ఫీజుబిలిటిని బట్టి డిస్పోజ్ చేసేందుకు చేపట్టిన స్టడీ సోమవారం సాయంత్రానికి ముగిసినట్లు సమాచారం.
