- ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 105 కి.మీ. రహదారి
- మొత్తం రూ.4,054 కోట్లతో 162 కి.మీ. నిర్మాణం
- 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
- మొత్తం 124 బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై జనవరిలో రాకపోకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైవే పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ముందుగా వైరా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని జంగారెడ్డిగూడెం వరకు వాహనాలను అనుమతించేలా అధికారులు ప్లాన్చేస్తున్నారు. సంక్రాంతి నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి, టోల్ ప్లాజాలను రెడీ చేసేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
వైరా, జంగారెడ్డిగూడెం మధ్య(120 కిలోమీటర్లు) వాహనాలు నడిచేలా టోల్ ప్లాజా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ధంసలాపురం ఎగ్జిట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేరు బ్రిడ్జి పనులను వేగవంతం చేసేలా కాంట్రాక్టు ఏజెన్సీపై ఒత్తిడి చేస్తున్నారు. కొదుమూరు సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ లైన్ల షిఫ్టింగ్ పైనా ఫోకస్‌పెట్టారు.
కనీసం గంటన్నర సమయం ఆదా
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీని కలుపుతూ ఖమ్మం, దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర రూ.4,054 కోట్లతో ఈ హైవేను 5 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ఖమ్మం జిల్లాలో మూడు ప్యాకేజీలు ఉన్నాయి. రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గనుంది.
సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నరలోనే ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లవచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మీదుగా వందనం సమీపంలో నాగపూర్, అమరావతి హైవే వెళ్తుంది. ఇక్కడ రెండు హైవేల అనుసంధానానికి క్లోవర్ లీఫ్ ఇంటర్ ఛేంజ్ నిర్మించనున్నారు.
సదుపాయాలు ఇవీ..
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన రహదారులు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఉన్నచోట 8 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు ఎక్కడంటే అక్కడ హైవే పైకి ఎక్కేందుకు వీలుండదు.
పశువులు, జంతువులు రాకుండా, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. టూవీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా అనుమతించరు. కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో హైవేపై ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గరే టోల్ ప్లాజాలుంటాయి.
హైవేలో ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారో గుర్తించి, దాని ప్రకారమే ఫాస్టాగ్ బ్యాలెన్స్కట్ అవుతుంది. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్ లేన్లు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్‌పాస్‌లు, సాగునీటి కాల్వల దగ్గర అండర్‌బ్రిడ్జిలు(మొత్తం 124) నిర్మించారు.
ధంసలాపురం ఎగ్జిట్ పనులతో ఆలస్యం
ఈ హైవే నిర్ణయించిన సమయంలో ధంసలాపురం ఎగ్జిట్ లేదు. గతేడాది స్థానికుల ఆందోళన, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒత్తిడి మేరకు ఎగ్జిట్ ను మంజూరు చేశారు. డిజైన్లు ఆలస్యం కావడంతో మొత్తం ప్రాజెక్టు ఆలస్యమైంది.
దీనికితోడు రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం కూడా లేట్ కావడం, కొదుమూరు సమీపంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పు వంటి అడ్డంకులతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని డిజైన్లు రావడంతో జనవరి 20 నాటికి ఆర్వోబీ పనులను కనీసం ఒకవైపు పూర్తి చేసి, రాకపోకలను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.
