- కోలుకునేందుకు కొన్ని నెలలు పట్టింది: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓటమి అభిమానులతో పాటు ఆటగాళ్లకూ గుండెకోతను మిగిల్చింది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఆ పరాజయంతో తాను కుంగిపోయానని టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆ బాధలో ఏకంగా క్రికెట్ నుంచే రిటైర్ అవ్వాలని అనుకున్నానని చెప్పాడు. రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఇండియా ఆ మెగా టోర్నీలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరింది. కానీ, తుది పోరులో ట్రావిస్ హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టడంతో రోహిత్ సేనకు షాకిస్తూ ఆస్ట్రేలియా కప్పు నెగ్గింది. ‘2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నేను పూర్తిగా కుంగిపోయాను. ఇక ఈ ఆట ఆడకూడదని బలంగా నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఆ టోర్నీ కోసం, ఆ కప్ కోసం నా సర్వస్వం ధారపోశాను. ఆ రోజు నాలో ఇంకేమీ మిగలలేదని, క్రికెట్ నా శక్తి మొత్తాన్ని పీల్చేసిందనిపించింది. ఆ బాధ నుంచి కోలుకుని, మళ్లీ మామూలు మనిషిని కావడానికి చాలా టైమ్ పట్టింది. అయితే, నాకు క్రికెట్ అంటే ఎంత ప్రాణమో నాకు నేను గుర్తుచేసుకున్నాను. నా కళ్ల ముందు ఉన్న అవకాశాన్ని, నా ఇష్టాన్ని అంత తేలికగా వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. నెమ్మదిగా మళ్లీ నాలో శక్తిని కూడగట్టుకుని మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాను’ అని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్ చెప్పుకొచ్చాడు.
పాఠం నేర్చుకున్నా
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన అనంతరం ఏడాది తిరగకుండానే రోహిత్ కెప్టెన్సీలోని ఇండియా అమెరికాలో టీ20 వరల్డ్ కప్ అందుకుంది. అయితే వన్డే కప్ ఓటమి తనకు జీవితంలో పెద్ద పాఠం నేర్పిందని రోహిత్ చెప్పాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి నాకో పెద్ద పాఠం. మనం దేని కోసమో తీవ్రంగా శ్రమించినప్పుడు, ఫలితం రాకపోతే కుంగిపోవడం సహజం. కానీ జీవితం అక్కడితో ఆగిపోదని తెలుసుకున్నాను. నిరాశ నుంచి ఎలా బయటపడాలి, మళ్లీ ఎలా రీసెట్ అయ్యి కొత్తగా ప్రారంభించాలి అనేది ఆ ఓటమే నేర్పింది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఫలితం వేరుగా ఉండబోతోందని నేను ఊహించా. అందుకే నా ఫోకస్ మొత్తం దానిపై పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు చెప్పడం చాలా ఈజీగానే అనిపిస్తుంది. కానీ ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను’ అని రోహిత్ వివరించాడు. టీ20, టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. చివరగా 2027 వరల్డ్ కప్‌లో ఆడి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఐసీసీ కప్పు నెగ్గాలని భావిస్తున్నాడు.
ఏం జరిగిందో నమ్మలేకపోయాం
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని తనతో పాటు టీమ్‌మేట్స్ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారని రోహిత్ తెలిపాడు. ‘టీమ్‌లోని ప్రతి ఒక్కరూ కుంగిపోయారు. అసలేం జరిగిందో మేం నమ్మలేకపోయాం. వ్యక్తిగతంగా నాకది మరింత గడ్డుకాలం. ఎందుకంటే 2022లో నేను కెప్టెన్ అయినప్పటి నుంచే కప్పు కోసం నా శక్తిని మొత్తం ధారపోశాను. టీ20 కప్ లేదా వన్డే కప్ ఎలాగైనా ఓ వరల్డ్ కప్ నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకున్నా. కానీ 2023లో అది సాధ్యం కాకపోవడంతో నేను చాలా బాధపడ్డా. నాలో ఎలాంటి శక్తి లేకుండా పోయింది. నేను తిరిగి సాధారణ మనిషిని అయ్యేందుకు కొన్ని నెలలు పట్టింది’ అని రోహిత్ వివరించాడు.
