ఆర్టీసీ సిబ్బందే టార్గెట్గా మోసాలు

ఆర్టీసీ సిబ్బందే టార్గెట్గా మోసాలు
  • బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు డిమాండ్​
  • నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్​ చేసి.. బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అంబర్ పెట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సరూర్ నగర్ జిల్లెలగూడకు చెందిన కె.సుదీర్(43) ఎంబీఏ చదివాడు. కొంతకాలంగా ఎంజీబీఎస్ పరిసరాల్లో కాలం గడుపుతూ ఆర్టీసీ ఉద్యోగుల విధులు, విజెలెన్స్ విభాగం పనితీరును తెలుసుకున్నాడు. ఆర్టీసీ సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే తీసుకునే చర్యలపై పట్టు సాధించాడు. అప్పటి నుంచి నగరంలో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రైవర్ సెల్ ఫోన్​లో మాట్లాడి డ్రైవ్​ చేస్తే, కండక్టర్ నిద్రపోతే విడియోలు తీస్తుంటాడు. అనంతరం వారి ఫోన్లకు వీడియోలు పంపి డబ్బులు డిమాండ్​ చేస్తున్నాడు.

బర్కత్​పుర ఆర్టీసీ డిపోలో కండక్టర్ మొగులయ్యను ఇలాగే బ్లాక్​మెయిల్​ చేయడంతో ఆయన ఈ నెల 2న కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించగా ఆయనపై రెండు నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నట్లు తెలిసింది. 2015 నుంచి 2017 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.3 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని 10 కేసులు నమోదయ్యాయి. గతంలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

ఇళ్ల పేరుతో చీటింగ్..

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య వివరాలను వెల్లడించారు. సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలోని బడిచౌడిలో నివసించే ఎస్.సరస్వతికి నిజామాబాద్ కు చెందిన ఉసికల విజయ్(35), ఇతని స్నేహితుడు అంబం మురళీ పరిచయమయ్యారు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సరస్వతితో పాటు మరో 18 మంది వద్ద సుమారు రూ.39 లక్షలు తీసుకున్నారు. నకిలి పట్టాలు సృష్టించి బాధితులకు ఇచ్చారు. విషయం తెలిశాక వారు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్​ చేసి  రిమాండ్​కు పంపించారు.