చివరి దశకు అర్హులు ఎంపిక భూదాన్ బాధితుల్లో 350 మందికి పైగా అర్హులు

 చివరి దశకు అర్హులు ఎంపిక భూదాన్ బాధితుల్లో 350 మందికి పైగా అర్హులు
  • 60 మందికి రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చే ప్లాన్ 
  • మిగిలిన అర్హుల కోసం వేర్వేరు చోట్ల స్థలాల పరిశీలన
  • ఈనెల 15లోగా స్థలం, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి డెడ్ లైన్​ 
  • ఈనెల 10లోగానే పూర్తి చేస్తామంటున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు: వెలుగుమట్ల భూదాన్​ భూమిలో ఆక్రమణల తొలగింపు ఘటనలో అర్హుల కోసం చేపట్టిన సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఇండ్ల కూల్చివేత సమయంలో తీసుకున్న వివరాలతో పాటు, అంబేద్కర్ భవన్​టీటీడీసీలో ఆశ్రయం పొందుతున్న బాధితుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. మొత్తం 730 మంది ఉన్నట్టు లెక్కతేలగా, వారిలో జిల్లాల వారీగా పేర్లను వేరు చేశారు. మొత్తం బాధితుల్లో 350 మంది అర్హులున్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన వారిని మండలాల వారీగా గుర్తించి, వారి గురించి ఎంక్వైరీ చేసే బాధ్యత 21 మంది తహశీల్దార్లకు అప్పగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వారు మొత్తం 570 మంది ఉండగా, అత్యధికంగా ఏన్కూరు మండలానికి చెందిన వారు 70, కొణిజర్ల నుంచి 50 మంది వరకు ఉన్నారు. ఇల్లందుకు చెందిన వారు 50, ఇతర జిల్లాలకు చెందిన వారు 160 మంది ఉన్నట్టు లెక్కతేలింది. అర్హులకు ఈనెల 15లోగా ఇంటి స్థలంతో పాటు, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆదేశించడంతో, ఆ మేరకు అధికారులు తీవ్ర కసరత్తు 
చేస్తున్నారు.

సర్వేలో ఎదురవుతున్న సవాళ్లివే..!

గత నెల 24న వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకోవడంతో పాటు, ఇండ్లు కట్టుకున్న వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేశారు. ఈ సమయంలోనే పూర్తి ప్రక్రియను వీడియో రికార్డు చేయడంతో పాటు, ఇండ్లలో ఉన్న వస్తువులను, అక్కడి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత బాధితులను అంబేద్కర్​ భవన్​, టీటీడీసీకి తరలించగా, అక్కడ కూడా నిర్వాసితుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. 

ఈ సమయంలో ఒక్కరికి కూడా వినోభా నగర్​ కు చెందిన ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని గుర్తించారు. వివరాల నమోదు సమయంలో ఖమ్మంలో ఉంటున్నట్టు చెప్పినా, పూర్తి సమాచారం కోసం ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో మాత్రం వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్​ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులన్నీ సొంతూర్లలోని అడ్రస్​ తోనే ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా   మండలాల్లో ఉన్న వారి డేటాను ఆయా మండల తహశీల్దార్లకు పంపించి ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంత భూమి ఉంది, ఏడాదికి ఆదాయం ఎంత వస్తోంది, గతంలో ప్రభుత్వం నుంచి లబ్దిపొందారా, ఇంతకు ముందు ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నారా, కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగముందా అని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలుగా తేలితే, వారికి ఇప్పుడు ఇంటి స్థలంతో పాటు, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒకట్రెండు రోజుల్లోనే క్లారిటీ..!

ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారం 350 మందికి పైగా అర్హులను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వారిని కేటగిరీల వారిగా విభజించి, పూర్తి న్యాయం చేయాలని భావిస్తున్నారు. పూర్తిగా నిరుపేదలుగా గుర్తించిన వారికి ఇంటి స్థలంతో పాటు, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తూ పత్రం ఇవ్వనున్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఆ స్థలంలో కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని వెంటనే అందజేస్తారు. ఇక ఖమ్మం అర్బన్​ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 60 డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు ఉండగా, వాటిని ఆసక్తి ఉన్న వారికి కేటాయించాలని భావిస్తున్నారు. ఈనెల 15లోగా ప్రక్రియను కంప్లీట్ చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించినప్పటికీ, ఈనెల 10లోగా పని పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇక వారికి ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆఫీసర్లు అన్వేషిస్తున్నారు. ఖమ్మం అర్బన్​, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్​ మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శివాయిగూడెంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని స్థలాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని ఓ అధికారి చెప్పారు.