హుజూర్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల పూర్తి మద్దతు ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో రూ.125 కోట్లతో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్ల గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2012లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును తాను మంత్రి అయిన తర్వాత ప్రత్యేక నిధులిచ్చి, 14 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నట్లు వెల్లడించారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా, కేవలం అర్హులైన పేదలకు మాత్రమే అందజేస్తామని స్పష్టం చేశారు.
గృహ సముదాయంలో రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీనరసింహ, మున్సిపాలిటీ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్పర్సన్ తన్నీరు మల్లికార్జునరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీవో సుమంత్ రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
