మేడ్చల్ జిల్లాలో ప్రియుడి మోజులో భర్తను చంపేసింది

మేడ్చల్ జిల్లాలో  ప్రియుడి మోజులో భర్తను చంపేసింది
  •     ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మెడకు చున్నీలు బిగించి హత్య
  •     ముగ్గురు నిందితులు అరెస్ట్, రిమాండ్

మేడిపల్లి, వెలుగు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మెడకు మూడు చున్నీలు బిగించి హతమార్చింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో వి.జే.అశోక్ (45), పూర్ణిమ దంపతులు నివాసముంటున్నారు. అశోక్​ఓ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్​గా పనిచేస్తుండగా, పూర్ణిమ స్థానికంగా ప్లే స్కూల్ నడిపిస్తున్నది. 

అయితే, వీరు ఈ కాలనీ దాదాపు 18 నెలల కింద రాగా, అంతకుముందు వేరే చోట ఉన్నప్పుడు నిర్మాణ పనులు చేసే పలేటి మహేశ్ (22) తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో వీరిద్దరిపై భర్తకు అనుమానం రావడంతో మందలించాడు. 

ఈ సమయంలోనే డిసెంబర్ 10న మహేశ్ తన ఇంటి ముందు కనిపించడంతో మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో తమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మహేశ్​తో కలిసి పూర్ణిమ ప్లాన్ వేసింది. దాని ప్రకారం మరుసటి రోజు 11న మహేశ్, తన స్నేహితుడు భూక్యా సాయితో కలిసి ముగ్గురు ఇంట్లో అశోక్ కోసం వేచి ఉన్నారు. కాలేజీలో డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి రాగానే మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. 

పూర్ణిమ ముందుగా అశోక్ కాళ్లు గట్టిగా పట్టుకుంది. మహేశ్ దాడికి పాల్పడి మెడకు మూడు చున్నీలు బిగించి గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా దుస్తులు మార్చి గుండెపోటుతో మరణించినట్లు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, శవంపై గాయాలు కనిపించడంతో అనుమానంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పూర్ణిమ నిజం ఒప్పుకోవడంతో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.