మామూలుగా అయితే వంట వాసన చూస్తే నోరూరిపోతుంటుంది ఎవరికైనా. కానీ, ఉసిరికాయ మాత్రం వండకుండానే ఊరించేస్తుంది. మరి ఈ ఊరించే ఉసిరితో వంటలు చేస్తే.. కాంబినేషన్ అదిరిపోతుంది. పైగా ఈ రెసిపీలు రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అంతేనా... నిల్వ కూడా ఉంటాయి కాబట్టి ఉసిరి రుచుల్ని చాలారోజుల పాటు ఆస్వాదించొచ్చు. మరింకెందుకాలస్యం.. ఈ రెసిపీలపై ఓ లుక్కేయండి.
కారప్పొడి
కావాల్సినవి :
ఉసిరికాయలు : ఎనిమిది లేదా పది
నూనె : ఒక టేబుల్ స్పూన్,
శనగపప్పు, మినప్పప్పు : రెండు టేబుల్ స్పూన్లు
ధనియాలు : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర : అర టేబుల్ స్పూన్
మిరియాలు : అర టీస్పూన్
ఎండు మిర్చి : పన్నెండు
వెల్లుల్లి రెబ్బలు : పది
ఇంగువ : చిటికెడు
ఉప్పు : సరిపడా
పసుపు : పావు టీస్పూన్
తయారీ : ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా తరగాలి. లేదా తురుము కూడా పట్టొచ్చు. కడాయిలో నూనె వేడి చేసి అందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఒక్కోటిగా వేసి దోరగా వేగించాలి. ఆ తాలింపులో ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి కలపాలి. అవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి, చల్లారబెట్టాలి. అదే కడాయిలో ఉసిరికాయల తరుగు వేసి క్రిస్పీగా అయ్యేవరకు వేగించాలి. వాటిని కూడా మరో ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీజార్‌లో తాలింపు మిశ్రమం, వేగించిన ఉసిరికాయ తరుగు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ఉసిరి కారం పొడి టిఫిన్స్, అన్నంలోకి బాగుంటుంది.
ఇన్స్టంట్ పికెల్
కావాల్సినవి :
ఉసిరికాయలు : పది
నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీస్పూన్
ఉప్పు : సరిపడా
మెంతులు : అర టీస్పూన్
మినప్పప్పు : రెండు టీస్పూన్లు
ఎండుమిర్చి : పదిహేను
కరివేపాకు : కొంచెం
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
నిమ్మరసం : ఒక టీస్పూన్
తాలింపు కోసం : ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ
తయారీ : పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వేసి ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి పదినిమిషాలు వేగించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసి, చల్లారబెట్టాలి. అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో మెంతులు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించాలి. వాటన్నింటినీ ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి. అవన్నీ మిక్సీజార్‌లో వేసి, నిమ్మరసం పిండి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసిన ఉసిరి తొక్కు వేసి కలపాలి. ఈ తొక్కును గాలిచొరబడని డబ్బాలో వేసి మూతపెడితే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది.
ఆమ్లా చుండా
కావాల్సినవి
ఉసిరికాయలు : అర కిలో
అల్లం : చిన్న ముక్క
జీలకర్ర, మిరియాలు, సోంపు : ఒక్కో టీస్పూన్ చొప్పున
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : రెండు
యాలకులు : మూడు
పటిక బెల్లం : 50 గ్రాములు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
బెల్లం : 300 గ్రాములు
సొంఠి పొడి : పావు టీస్పూన్
తర్భూజ గింజలు : ఒక టేబుల్ స్పూన్
తయారీ : లేత ఉసిరికాయలు శుభ్రంగా కడగాలి. వాటిని ఆవిరి మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి. చల్లారాక వాటిలోని గింజలు తీసేసి, కాయల్ని తురమాలి. అల్లం సన్నగా, పొడవుగా తరిగి, పాన్‌లో వేసి తడిపోయేవరకు వేడి చేయాలి. తర్వాత అందులోనే జీలకర్ర, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు వేసి వేగించాలి. వాటిని చల్లారబెట్టాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఉసిరికాయ తురుము వేడయ్యాక అందులో బెల్లం వేయాలి. మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఉప్పు, సొంఠి పొడి వేసి కలపాలి. తర్భూజ గింజల్ని నూనె లేకుండా వేగించి, చల్లారాక మిశ్రమంలో వేసి కలపాలి. కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. రుచికరమైన ఈ స్వీట్‌ని నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది.