
మహారాష్ట్ర : బీడ్‌లో మాజీ ప్రజా ప్రతినిధి, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్లు అతిక్ అహ్మద్, అష్రఫ్‌లను అమరవీరులుగా అభివర్ణిస్తూ మహారాష్ట్రలోని బీడ్ లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లు అంటించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్లు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లను అమరవీరులుగా కీర్తిస్తూ.. బీడ్ లో పోస్టర్లలో అంటించడంతో.. విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 293, 294, 153 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హోర్డింగులపై పోస్టర్లు అంటించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మౌసిన్ భయ్యా మిత్ర మండల్ వారు వేసిన పోస్టర్లు పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే తొలగించారు.
మరోవైపు పరారీలో ఉన్న అతిఖ్ అహ్మద్ భార్య షాహిస్తా పర్వీన్ ఆచూకీ ఇంకా చిక్కడం లేదు. సిట్ బృందం షాహిస్తా కోసం యూపీతో పాటు ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో గాలిస్తోంది. ఇంకోవైపు.. పోలీస్ కస్టడీలోని అతిఖ్, అష్రఫ్‌ను కాల్చి చంపిన ముగ్గురు నిందితులకు ప్రయాగ్‌రాజ్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. హత్య జరిగిన రోజు అతిఖ్,అష్రఫ్‌కు భద్రతగా ఉన్న ఐదుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వాళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ , అతడి సోదరుడు అష్రఫ్ హత్య కేసులపై దాఖలైన పిటిషన్‌ను ఈనెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. అతిఖ్ హత్యపై సీబీఐతో లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు అతిఖ్ హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని లాయర్ విశాల్ తివారి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీలో జరిగిన 180 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరపాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పోలీస్ కస్టడీలో ఉన్న అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఏప్రిల్ 15వ తేదీ రాత్రి మీడియా కెమెరాల ముందు దారుణ హత్యకు గురయ్యారు. వారి చుట్టూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, లైవ్ కెమెరాలు ఉండగానే.. పాయింట్ బ్లాకులోకి వచ్చి కాల్చి చంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అష్రఫ్ లను వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో జర్నలిస్టులమని చెప్పి వచ్చిన ముగ్గురు యువకులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు.