ఆవుల పంపిణీలో 3 కోట్ల గోల్ మాల్!

ఆవుల పంపిణీలో 3 కోట్ల గోల్ మాల్!

ఏసీబీ చేతిలో అక్రమాల చిట్టా
 గొర్రెల తరహాలోనే అవకతవకలు
డబ్బు ఇతరుల ఖాతాలకు మళ్లింపు
మొన్న గొర్రెలు.. ఇవాళ ఆవులు
కదులుతున్న గత ప్రభుత్వ డొంక

హైదరాబాద్: పశుసంవర్ధకశాఖలో భారీ స్కాం వెలుగు చూసింది. గొర్రెల స్కీం తరహాలో ఆవుల పంపిణీలోనూ రూ. 3 కోట్ల గోల్ మాల్ జరిగింది.  గొర్రెల స్కామ్ లో రూ.2.10 కోట్లు మోసం జరగగా.. ఇప్పటికే నలుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠాయే.. ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. 

పుంగనూరు సరఫరాదారులను ఈ ముఠా సభ్యులు నట్టేట ముంచినట్లు తెలుస్తోంది. 2022 జనవరిలో పాడి రైతులకు ఆవులు పంపిణీ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.  ఒక్కో యూనిట్ కి రూ.70వేల చొప్పున అధికారులు ఈ స్కీమ్ కు ఫిక్స్ చేశారు. దీంతో చిత్తూరు జిల్లా పుంగనూరు సరఫరాదారులను అధికారులు ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లను అధికారులు కొనుగోలు చేశారు. ఆవుల కొనుగోలుకు దాదాపు ఎనిమిదిన్నర కోట్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. సరఫరా పూర్తై నెలలు దాటినా రూ.4 కోట్లు మాత్రమే సరఫరాదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. 

పుంగనూరు టు హైదరాబాద్

ఆవులు సరఫరా చేసిన పుంగనూరు  రైతులు తమకు డబ్బులు రాకపోవడంతో 2022 మార్చిలో హైదరాబాద్‌ కు వచ్చి వాకబు చేశారు.  ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలయ్యాయని వాటిని సంబంధం లేని వారి ఖాతాల్లోకి మళ్లినట్టు తేలింది.  అధికారులు సహా సంబంధం ఉన్న ముఠా సభ్యులను సరఫరా దారులు నిలదీశారు. ఒక సారి రూ.కోటి 5 లక్షలు, మరో విడతలో రూ.40 లక్షలను బాధితులకు సంబంధిత వ్యక్తులు చెల్లించారు.

ALSO READ :- మేడారంలో తిరుగువారం..గద్దెలను శుద్ది చేసిన పూజారులు

మిగిలిన మొత్తం డబ్బుల విషయంలో సతాయించడంతో వాళ్లు స్థానిక ప్రజాప్రతినిధిని సంప్రదించారు.  డబ్బుల విషయమై అడిగితే ముఠా సభ్యులు దబాయించడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో విషయం వెలుగు చూసింది.