
తెలంగాణలో జులై 29న ఉదయం వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలో యువతి మృతి చెందగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నారు. బోరున విలపిస్తున్నారు.
జులై 29న ఉదయం రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి వచ్చిన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అంబటిపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొని మూడు సంవత్సరాల పాప మృతి చెందింది. సింగనేని మల్లేష్ భాగ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తోడుగా చెల్లెలు శ్రీ హర్షిణి కూడా వెళ్లింది. బస్సు వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది శ్రీ హర్షిణి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.