
- అధికారికంగా ప్రకటించని పోలీసులు
- ఐదు రోజులుగా భద్రతా బలగాల కూంబింగ్
- నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో ముందుకు...
- హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, సరుకులు సరఫరా
- కాల్పులు, బాంబు పేలుళ్లతో భయాందోళనలో గిరిజనులు
- మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్
- గతంలో పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా
జయశంకర్ భూపాలపల్లి / వెంకటాపురం, వెలుగు: మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు.. కర్రె గుట్టల్లో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టి ఐదు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం చత్తీస్‌గఢ్ వైపు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారనే వార్తలు వస్తున్నాయి. కర్రె గుట్టల్లోని ఆదివాసీల ద్వారా ఈ సమాచారం అందుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. కర్రె గుట్టల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ గురువారం ప్రకటించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కర్రె గుట్టల్లో మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు10 వేల మందితో కూడిన భద్రతా బలగాలు ఈ నెల 21న రంగంలోకి దిగాయి.
మావోయిస్టులుఅమర్చిన ఐఈడీ బాంబులను పేల్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. కర్రె గుట్టల్లో దాక్కున్న మావోయిస్టులను డ్రోన్ల సాయంతో కనిపెడుతూ తూటాల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలకు అవసరమైన అధునాతన ఆయుధాలు, వంట సామగ్రి, ఇతర సరుకులను రెండు హెలికాప్టర్ల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఆయుధాల సరఫరాకు ప్రత్యేకంగా ఒక ఆర్మీ హెలీకాప్టర్ వాడుతున్నారు. ఇది ప్రతిరోజు వెంకటాపురం నుంచి కర్రె గుట్టల్లోని ఎన్‌కౌంటర్ స్పాట్‌కు వెళ్లి వస్తున్నది. అలాగే మరో హెలికాప్టర్‌లో బలగాలకు కావాల్సిన వంట సామగ్రి, ఇతర సరుకులు పంపిస్తున్నారు. కాగా, మావోయిస్టుల పేరుతో కర్రె గుట్టల్లోని అమాయక గిరిజనులను బలగాలు కాల్చి చంపే ప్రమాదముందని పౌర హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో..
మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు మడవి హిడ్మా, దేవా దళాలతో పాటు దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు కర్రె గుట్టల్లో ఆశ్రయం పొందారనే పక్కా సమాచారంతో చత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, డీఆర్‌జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా తదితర భద్రతా బలగాలు ఈ నెల 21న స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. అదేరోజు సాయంత్రం కల్లా నాలుగు దిక్కుల నుంచి కర్రె గుట్టలను చుట్టుముట్టాయి. మావోయిస్టులు తమ ఆత్మరక్షణ కోసం గుట్టల చుట్టూ అమర్చిన ఐఈడీ బాంబులను బాంబ్ స్క్వాడ్‌లతో నిర్వీర్యం చేస్తూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటూ కాల్పులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందగా,విషయాన్నిబస్తర్‌ఐజీసుందర్‌రాజ్ గురువారం ప్రకటించారు. శుక్రవారం 30 మంది దాకా జవాన్లుడీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు వచ్చాయి.
కానీ పోలీస్అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇక శనివారం ఉదయం కర్రె గుట్టల్లో భారీ ఎన్కౌంటర్జరిగినట్టు కాల్పుల శబ్దాలు వినిపించడంతో గిరిజనులు భయంతో వణికిపోయారు. చత్తీస్గఢ్వైపు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్అయ్యాయి. కానీ శనివారం అర్ధరాత్రి వరకు కూడా పోలీసుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాగా, కర్రె గుట్టలపై ఐదు రోజులుగా బాంబు పేలుళ్లు, కాల్పుల మోత వినిపిస్తోందని పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల, జెల్ల, పెనుగోలు, కొంగాల, అరుణాచలపురం, బొల్లారం, వెంకటాపురం మండలంలోని పెంకవాగు, మల్లాపురం, కదైవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల ప్రజలు చెబుతున్నారు. తిప్పాపురం. వీరభద్రవరం, రామచంద్రపురం గ్రామాల సమీపంలో శనివారం ఉదయం పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగిందని చెప్పారు.
హిడ్మా.. చిక్కడు దొరకడు
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్‌గా ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటే అక్కడ.. ఆయనకు మూడంచెల భద్రత కోసం వందల మంది మావోయిస్టులు ఉంటారు. కర్రె గుట్టల్లో హిడ్మా బెటాలియన్ దాక్కుందనే పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలుఇక్కడపోలీస్‌ఆపరేషన్‌స్టార్ట్ చేశాయి. కాగా, భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హిడ్మా నేర్పరి. దండకారణ్యం మొత్తం అతనికి కొట్టిన పిండి. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ఈసారి ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు కర్రె గుట్టల చుట్టూ నలువైపులా మోహరించాయి.