మోదీ 4 కోట్ల ఇండ్లు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది 30 వేలే

మోదీ 4 కోట్ల ఇండ్లు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది 30 వేలే
  • కేసీఆర్​ది డబుల్ మోసం
  • తొమ్మిదేండ్లయినా పేదలకు ఇండ్లు ఇయ్యలే: కిషన్ రెడ్డి 
  • మోదీ 4 కోట్ల ఇండ్లు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది 30 వేలే  
  • రాష్ట్రంలో 30% కమీషన్ సర్కార్ నడుస్తున్నది  
  • బీఆర్ఎస్​ మళ్లీ వస్తే  జనం భూములూ అమ్ముతదని ఫైర్ 
  • డబుల్ బెడ్రూం ఇండ్లపై ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా 

హైదరాబాద్, వెలుగు:  పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇండ్ల పేరుతో ఓట్లు దండుకుని.. తొమ్మిదేండ్లయినా పేదలకు ఇండ్లు కట్టియ్యలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో కేసీఆర్ ది డబుల్ మోసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. దీనికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘పేద లకు ఇండ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగనని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. 2018లో ప్రజ లను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్ప టికీ పేదలకు ఇండ్లు రాలేదు. -8 నెలల్లో సెక్రటేరియెట్, 4 నెలల్లో ప్రగతి భవన్ కట్టారు. ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. కానీ పేదలకు మాత్రం ఇండ్లు ఇవ్వలేదు” అని మండిపడ్డారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 10 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ కార్మికులు, జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. శిలాఫలకాలు వేసి ఇండ్లు కట్టియ్యలేక, వాటిని తీసుకువెళ్లి ప్రగతి భవన్​లో దాచుకున్నారని విమర్శించారు. ‘‘జాగ ఉన్నోళ్లు ఇల్లు కట్టుకుంటే రూ.6 లక్షలు ఇస్తామని మొదట చెప్పారు. ఆ తర్వాత రూ.5 లక్షలు అన్నరు. ఇప్పుడు రూ.3 లక్షలు అంటున్నరు. అదికూడా లక్ష చొప్పున మూడుసార్ల ఇస్తరట. అదంతా మోసం.. ఎన్నికల తర్వాత ఒక్కపైసా కూడా ఇవ్వరు” అని అన్నారు.  దేశంలో ప్రధాని మోదీ 4 కోట్ల ఇండ్లు కట్టిస్తే, తెలంగాణలో కేసీఆర్​ కేవలం 30 వేల ఇండ్లు మాత్రమే కట్టారని విమర్శించారు. కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టిస్తానంటే, కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తెచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 

కేసీఆర్ ఇక ఫామ్ హౌస్​కే.. 

రాష్ట్రంలో 30 శాతం కమీషన్ల ప్రభుత్వం కొనసాగుతున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం చేయాలన్నా, భూములు అమ్మాలన్నా, అపార్ట్ మెంట్ లు కట్టాలన్నా.. బీఆర్ఎస్ నాయకులకు 30శాతం కమీషన్ ఇయ్యాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా కాంట్రాక్టర్లు 30 శాతం కమీషన్ చెల్లించాల్సిందే. దళిత బంధు కింద రూ.10 లక్షలు వస్తే, అందులో రూ.3 లక్షలు (30 శాతం) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే” అని అన్నారు. ఇది తాను అంటున్న మాట కాదని, బీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారని పేర్కొన్నారు. 

‘‘బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటున్నది. ఆ పార్టీకి మళ్లీ అధికారమిస్తే అరాచక పాలన సాగుతది. ఇక మన ఆస్తులు, భూములు కూడా ఉండవు. అవినీతి పాలనకు ప్రతిరూపమైన బీఆర్ఎస్ ను ఓడించాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని చెప్పారు. ‘‘మరో 4 నెలల్లో బీఆర్ఎస్ గద్దె దిగడం ఖాయం. కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లడం పక్కా” అని అన్నారు. ఈ ధర్నాలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, రాంచందర్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, విజయరామారావు, దుగ్యాల ప్రదీప్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్: ఈటల  

సీఎం కేసీఆర్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్ చేశారు. ‘‘కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదల నోట్లో మట్టి కొట్టారు. తొమ్మిదేండ్లలో ఇండ్ల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.600 కోట్లే. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే ఇండ్లు కట్టారు” అని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టు పక్కల పేదలకు ఒక్క గజం భూమి అయినా ఇచ్చే ధైర్యం కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే పేదల బతుకులు ఆగమేనని అన్నారు. 

గృహనిర్మాణ శాఖనే లేదు: అర్వింద్ 

రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖనే లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అలాంటప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరు కడ్తరని ప్రశ్నించారు. ‘‘గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మూడ్రోజులే టైమ్ ఇచ్చారు. కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడానికే 30 రోజులు పడుతుంది. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తలేదు. అలాంటప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎట్ల దరఖాస్తు చేసుకోవాలి” అని ప్రశ్నించారు. ‘‘నాకు నా తండ్రి సంస్కారం నేర్పారు. కేటీఆర్ తన తండ్రికి సంస్కారం నేర్పితే బాగుంటుంది” అని కౌంటర్ ఇచ్చారు.

ఆందోళనలు తీవ్రం చేస్తం.. 

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. పేదలకు ఇండ్లు ఇవ్వకపోతే, ప్రభుత్వాన్ని పాతరేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని తెలిపారు. ఈ నెల 16,17 తేదీల్లో  ‘బస్తీ బాట’ చేపట్టి, బస్తీల్లో సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఈ నెల18న మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. 23, 24 తేదీల్లో అన్ని కలెక్టరేట్ ల వద్ద ఆందోళ నలు చేస్తాం. వచ్చే నెల 4న హైదరాబాద్ లో భారీ ధర్నా ఉంటుంది. సీఎం కండ్లు తెరిపించే విధంగా సిటీలో భారీ ధర్నా నిర్వహిస్తాం. బీజేపీ విశ్వరూపం చూపిస్తాం” అని చెప్పారు.