30 లక్షల మంది నిరుద్యోగులు క్షమించరు

30 లక్షల మంది నిరుద్యోగులు క్షమించరు

జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తిస్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా వెల్లడిస్తాం, అవసరమైతే ఆ బోర్డును కూడా ప్రక్షాళన చేసి మా తెలంగాణ యువతకు, గవర్నమెంట్ జాబు పోగొట్టుకుంటున్న యువతకు కూడా న్యాయం చేస్తాం. మాపై విశ్వాసం ఉంచండి. తిరిగి మళ్ళీ ఒక్కసారి ఆశీర్వాదం ఇవ్వండి. పేరుపేరునా  తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ వేడుకుంటున్న వీడియో నేటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వైరల్​గా మారింది. 

30 లక్షల నిరుద్యోగులు వారి కుటుంబాల భారీ ఓటు బ్యాంకు, మీ కుటుంబ పాలనను కూల్చడానికి సిద్ధమైందని తెలిసి.. నేడు జాబ్ క్యాలెండర్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారని నిరుద్యోగులకు తెలియని విషయమా? ఉద్యోగాలు ఇవ్వడం అసలు ఇష్టమే ఉంటే  ప్రవళికతోపాటు ఎందరో  నిరుద్యోగులు మీ విధానాలకు బలయ్యేవారా? పరీక్షల వాయిదా, లీకులు, పరీక్షల రద్దు, అధ్వానమైన నిర్వహణ అంతా యాదృచ్ఛికంగా జరిగిందా? నిర్లక్ష్యం వల్ల జరిగిందా?  

నిరుద్యోగ క్షోభతో ప్రవళిక మరణం

ఓ పేద రైతు కుటుంబంలోని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంకల్ప బలంతో ప్రవళిక  ముందుకు సాగింది. రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయింది. మీ లోపభూయిష్ట  విధానాలు,  పోటీ పరీక్షలు రద్దు, వాయిదా పడుతూ ఎప్పుడు జరుగుతాయో తెలియని గందరగోళంలో ప్రవళిక కృంగిపోయింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ కల నెరవేరదని ఆవేదన చెందింది. మరోవైపు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయింది. తల్లిదండ్రుల్లా, అంత మోటు కష్టం చేయలేక, ఉద్యోగ సాధనకు పట్టణానికి వచ్చిన ప్రవళిక. ఈ మానసిక సంఘర్షణలో  కకావికలమై ఉరి వేసుకుంది. లక్షలాది మంది నిరుద్యోగులు పడుతున్న నిరుద్యోగ క్షోభకు, ప్రవళిక మరణం ఒక అద్దం లాంటి సాక్ష్యం కాదా?

కొత్త నాటకాన్ని నమ్మెదెవరు?

ప్రవళిక టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లకు, తాను అర్హత ఉన్న ఐదు నోటిఫికేషన్​లకు దరఖాస్తు చేసింది. గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లతో పాటు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్ గ్రేడ్ 2 కు దరఖాస్తు చేసింది. ప్రవళిక టీఎస్పీఎస్సీ ఐడి నెంబర్ దరఖాస్తు నెంబర్లన్నీ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రూప్-4 కు రెండుసార్లు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కు ప్రవళిక హాజరైందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. 

కేటీఆర్ లాంటివారు నిరుద్యోగులందరిని ఉద్దేశపూర్వకంగా తప్పుతోవ పట్టించడం దిగజారుడు కాదా? గ్రూప్స్ కే అప్లయ్​ చేయలేదనే కేటీఆర్,  పై ఆధారాలకు మీ జవాబు ఏమిటి?  30 లక్షల నిరుద్యోగులపై ఆ కుటుంబాలపై కేటీఆర్ చేసిన సామూహిక హననమూ, దాడి. ఏకపక్షంగా 30 లక్షల నిరుద్యోగులు, ఆ కుటుంబాలు, కల్వకుంట్ల పాలనను గద్దె దించడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ గుర్తించారు. పదేండ్ల కాలంలో నిరుద్యోగులను నిలువునా ముంచి, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు.  

మీరు రుచి మరిగిన అధికారం పోవడం ఖాయం అయిందని గుర్తించి, మూడోసారి అధికారం కోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, జాబ్​ క్యాలెండర్​ అనే జగన్నాటకానికి, అబద్ధాలకు తెగబడుతున్నారని నిరుద్యోగ బిడ్డలు వారి తల్లిదండ్రులు గుర్తించారు. దుర్మార్గమైన, నియంతృత్వ పాలనను కూల్చడానికి, ప్రతి నిరుద్యోగి పోలింగ్ తేదీ చివరి నిమిషం వరకు విరామ మెరుగక శ్రమించాలని నిర్ణయించుకున్నారు.

- నైనాల గోవర్ధన్,సోషల్​​ ఎనలిస్ట్