
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర బాంబు పేలుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది తాలిబాన్ తీవ్రవాదులు మృతిచెందారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని
బాల్ఖ్ ప్రావిన్స్‌లోని దవ్లత్ ఆబాద్ జిల్లాలోని కిత్లా గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలోని మసీదులో వీరందరికి బాంబు తయారుచేయడం గురించి క్లాస్ జరగుతుండగా ఈ పేలుడు సంభవించింది. దాంతో ఆరుగురు విదేశీ ఉగ్రవాదులతో సహా మొత్తం 30 మంది చనిపోయారు.
ఈ సంఘటన శనివారం ఉదయం 9.15 గంటలకు బాల్ఖ్ ప్రావిన్స్‌లోని కిత్లా గ్రామంలో జరిగింది. ఈ గ్రామం రాజధాని నగరం కాబూల్‌కు ఉత్తరాన 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉజ్బెకిస్తాన్‌తో సరిహద్దుకు ఆనుకొని ఉంటుందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయని, కానీ, ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ అన్నారు.
కాగా.. పేలుడును తాలిబాన్ నాయకులు ధృవీకరించారు, కానీ ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నట్లు సమాచారం.
బాల్ఖ్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధి మునీర్ అహ్మద్ ఫర్హాద్ మాట్లాడుతూ.. ‘తాలిబాన్లు కొన్నేళ్లుగా దవ్లత్ ఆబాద్‌ను స్థావరంగా మార్చుకున్నారు. బాల్ఖ్‌లో అమెరికా భద్రతా దళాలను తగ్గించినప్పటినుంచి తాలిబాన్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. పేలుడుపై అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.
For More News..