హైదరాబాద్‌‌లో రోజుకు 300–500 బోర్లు ఎండిపోతున్నయ్‌‌

హైదరాబాద్‌‌లో రోజుకు 300–500 బోర్లు ఎండిపోతున్నయ్‌‌
  • వెస్ట్ సిటీతో పాటు ఉప్పల్​, ఎల్బీనగర్‌‌‌‌, ఇబ్రహీంపట్నం, హయత్‌‌నగర్‌‌‌‌లో వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు 
  • మెట్రో వాటర్‌‌‌‌ బోర్డు అధికారుల స్టడీలో వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔటర్​ రింగ్​ రోడ్​(ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరంలో పలు ప్రాంతాల్లో అనూహ్యంగా బోర్లు ఎండిపోతున్నాయి. నగరంలో రోజుకు 300 నుంచి 500 బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం  మెట్రో వాటర్ బోర్డు అధికారులు చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వెస్ట్ సిటీతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్​, ఇబ్రహీంపట్నం, హయత్‌‌నగర్‌‌‌‌లాంటి ప్రాంతాల్లో బోరుబావులు చాలా త్వరగా ఎండిపోతున్నట్టు అధికారులు తెలిపారు.

వెస్ట్​సిటీలోని మాదాపూర్, కొండాపూర్, ఐటీ కారిడార్, కూకట్‌‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్​, మేడ్చల్, ఎస్‌‌ఆర్ నగర్‌‌‌‌లాంటి ప్రాంతాల్లో రోజుకు 300 నుంచి 500 బోర్లు ఎండిపోతున్నట్టు అధ్యయనంలో తేలినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర నీటి కటకట ఉన్న ప్రాంతాల నుంచి మెట్రోవాటర్​బోర్డుకు భారీ సంఖ్యలో ట్యాంకర్ల డిమాండ్​ పెరిగింది. తాజాగా మెట్రో వాటర్ బోర్డుకు మొదటి సారి వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా రోజుకు 300 నుంచి 400కు చేరినట్టు అధికారులు తెలిపారు. వాటర్​ట్యాంకర్ల కోసం వాటర్​ బోర్డుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ట్యాంకర్ల డెలివరీ కొంత ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. తాగునీటికి మాత్రమే  వాటర్​బోర్డు నీటిని సరఫరా చేస్తుందని, ఇతర అవసరాలకు మాత్రం బోర్​వెల్స్‌‌పైనే ఆధారపడక తప్పదని చెబుతున్నారు. 

వాటర్‌‌‌‌ ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్​

గ్రేటర్​ పరిధిలో ముఖ్యంగా వెస్ట్​సిటీలో పెరుగుతున్న నీటి సమస్య కారణంగా మెట్రో వాటర్​బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్​ పెరుగుతోంది. రెండు వారాల క్రితం అత్యధికంగా రోజుకు 12 వేల ట్యాంకర్ల బుకింగ్​ అయితే..  గత వారం రోజుల్లో ఈ బుకింగ్స్ సంఖ్య రోజుకు 16  వేలకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ బుకింగ్స్‌‌లో 50 శాతం వెస్ట్​సిటీ వైపు నుంచే వస్తున్నట్టు పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌‌ను దృష్టిలో పెట్టుకొని 3 షిఫ్టుల్లో వాటర్​ట్యాంకర్ల సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అలాగే, నగరంలో 86 ఫిల్లింగ్​ స్టేషన్లు ఉండగా.. తాజాగా 96 ఫిల్లింగ్​స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు, అలాగే ఫిల్లింగ్​ పాయింట్లను 141 నుంచి 167కు పెంచినట్టు చెప్పారు. ట్యాంకర్ల సంఖ్య 1,135 నుంచి 1,250కి పెంచినట్టు తెలిపారు. ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించేందుకు అదనపు ట్రిప్పులు, అదనపు సిబ్బందిని రంగంలోకి దింపామని, వారం రోజుల క్రితం వరకూ బుకింగ్​ జరిగిన 24 గంటల్లోనే డెలివరీ చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం కొంత ఆలస్యం అవుతున్నట్టు వెల్లడించారు.  

 హైరైజ్‌‌​ భవనాల నిర్మాణాలు కూడా కారణమే

గ్రేటర్​ పరిధిలో ముఖ్యంగా ఔటర్​ రింగ్​రోడ్​ వెంట భారీ ఎత్తున హైరైజ్‌‌​ భవనాలు వెలుస్తున్నాయి. కోకాపేట, నార్సింగి, వట్టి నాగులపల్లి, గండిపేట, కొండాపూర్, మియాపూర్, తెల్లాపూర్, పటాన్‌‌చెరు, మాదాపూర్, హైటెక్​సిటీ, ఇటు ఉత్తరాన ఘట్‌‌​కేసర్, ఉప్పల్, ఎల్బీనగర్‌‌‌‌, హయత్​నగర్​, ఉత్తరాన మేడ్చల్​, జీడిమెట్ల, పేట్​బషీరాబాద్, కొంపల్లిలాంటి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో హైరైజ్​ భవనాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే నార్సింగి, కోకాపేట, తెల్లాపూర్‌‌‌‌లాంటి ప్రాంతాల్లో  60 అంతస్తుల భవనాలు వెలిశాయి.

ఇలాంటి భారీ నిర్మాణాలకు తప్పనిసరిగా నీటి అవసరం పెద్ద ఎత్తున ఉంటుంది. దీంతో వేల అడుగుల్లో బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు.  మరోవైపు వర్షపు నీటిని భూమిలోకి పంపించేలా రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​ (ఇంకుడు గుంతల నిర్మాణం) మాత్రం పెద్దగా జరగడం లేదు. నగరమంతా కాంక్రీట్​జంగిల్‌‌గా మారిపోతున్న కారణంగానే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి భవనంలోనూ వర్షపునీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని మెట్రోవాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 30 వేల ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు.