తెలుగు సాహిత్యానికి డిజిటల్ వారధి.. వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం

తెలుగు సాహిత్యానికి డిజిటల్ వారధి.. వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం

మారుతున్న ఈ ఆధునిక కాలంలో సంప్రదాయ తెలుగు సాహిత్య రంగానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య ఒక బలమైన వారధి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మ్యాడం అభిలాష్ రచించిన ‘వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం’ పుస్తకం.. తెలుగు సాహిత్యంలో వికీపీడియా ప్రాధాన్యతను విశ్లేషిస్తూ వచ్చిన మొట్టమొదటి పరిశోధనాత్మక గ్రంథంగా గుర్తింపు పొందింది. 

విజ్ఞాన విప్లవం : హవాయి భాషలో ‘చకచక’ అనే అర్థం వచ్చే ‘వికివికి’ అనే పదం నుండి ‘వికీ’, ‘పీడియా’ అనే పదం వచ్చిందని వివరిస్తూ... దానిని తెలుగులోని అనుకరణ పదాలతో పోల్చిన తీరు ఆయన భాషా ప్రావీణ్యతకు అద్దం పడుతుంది. 2001లో జిమ్మీ వేల్స్ ఆంగ్లంలో ప్రారంభించిన ఈ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని, 2003లో వెన్న నాగార్జున గారి కృషి వల్ల తెలుగు పాఠకులకు ఏ విధంగా అనుసంధానించారో చారిత్రక ఆధారాలతో ఇందులో చర్చించారు. 

అంతేకాకుండా, తొలిదశలో ఎదురైన సాంకేతిక అవరోధాలను అధిగమించి, ప్రస్తుతం వాడుతున్న జిబోర్డ్, లిప్యంతరీకరణ విధానాల ద్వారా తెలుగు వికీపీడియా సాధించిన ప్రగతిని విమర్శనాత్మకంగా చర్చించారు. వికీపీడియాలో రాసే ప్రతి ఒక్కరిని ‘వికీపీడియన్’గా సంబోధిస్తూ, వారు సమిష్టి నిర్ణయాలు తీసుకునే ‘రచ్చబండ’ పేజీల ప్రాధాన్యతను గ్రామీణ సంస్కృతిలోని సమష్టి నిర్ణయాధికారంతో పోల్చడం అద్భుతమైన విమర్శనాత్మక దృక్కోణం.

మొలక వ్యాసాల సవాలు:  ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడంలో వికీపీడియా పోషిస్తున్న పాత్రను ఈ పుస్తకంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా 50 కంటే తక్కువ పదాలతో అసంపూర్ణ సమాచారంతో మిగిలిపోయే ‘మొలక వ్యాసాల’ సమస్యను ఇందులో విశ్లేషించారు. కేవలం కొత్త పేజీలను సృష్టించి వదిలేయడం వల్ల సాహిత్య సమాచారం అరకొరగానే ఉండిపోతోందని, వాటిని పూర్తిస్థాయి ప్రామాణిక వ్యాసాలుగా మార్చవలసిన బాధ్యత నేటి సాహిత్య పరిశోధకులపై ఉందనే విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. 

తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఎలా రాయాలో సోపానాల వారీగా వివరించడమే కాకుండా, దాని అనుబంధ సోదర సైట్ల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా విస్తరించవచ్చో నిరూపించారు. నకలు హక్కులు లేని అరుదైన పుస్తకాలను భద్రపరిచే డిజిటల్ వేదికగా ‘వికీసోర్స్’, అరుదైన చిత్రాలు, ఆడియోలను భద్రపరిచే ‘వికీకామన్స్’, ప్రముఖుల సూక్తుల సంకలనమైన ‘వికీవ్యాఖ్య’, కవులు సమిష్టిగా పుస్తకాలు రాసుకునే ‘వికీబుక్స్’, సమిష్టి నిఘంటువు అయిన ‘విక్షనరీ’ల ప్రాధాన్యతలను వివరించింది.

భాషా సాంస్కృతిక సేవ : అకడమిక్ విజ్ఞానాన్ని డిజిటల్ ప్రపంచంతో ముడిపెట్టే ఈ వినూత్న ప్రయత్నానికి, భాషా సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘బోలి చేతో సంస్థ’ వెన్నుదన్నుగా నిలిచింది. వారి తొలి ప్రచురణగా ఈ పుస్తకం వెలువడటం విశేషం. గోండీ వంటి గిరిజన భాషల డిజిటలైజేషన్, వికీమీడియా ప్రాజెక్టుల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపడుతున్న ఈ సంస్థ.. సాంకేతికతతో కూడిన ఒక సాహిత్య పరిశోధన గ్రంథాన్ని తమ ప్రచురణగా ఎంచుకోవడం ద్వారా డిజిటల్ యుగంలో భాషా పరిరక్షణ పట్ల తమకున్న అవగాహనను చాటుకుంది.

-  ఎడ్ల ప్రవీణ్​