నగరంనడిబొడ్డున చెత్త డంపు  ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం

నగరంనడిబొడ్డున చెత్త డంపు  ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం
  • రోజూ 40 టన్నుల చెత్తను తీసుకొస్తున్న వందలాది ఆటోలు, ట్రాక్టర్లు
  • చెత్త తరలింపుతో ట్రాఫిక్‌‌‌‌కు తీవ్ర అంతరాయం.. 
  •  హెల్త్​జోన్​గా పేరున్న ప్రాంతంలో దుర్వాసన, కాలుష్యంతో ప్రజల అవస్థలు 

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు నగర నడిబొడ్డున ప్రతిరోజూ దాదాపు 40 టన్నుల చెత్త  తరలిస్తుండడంతో కంపుకొడుతోంది. కమర్శియల్​ ప్రాంతంగా అభివృద్ధి చెందిన హనుమకొండలోని బస్టాండ్​ ప్రాంతాన్ని ఆనుకుని జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ స్టేడియం, ఏషియన్‌‌‌‌ మాల్‌‌‌‌, సాయిబాబా గుడి, గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌, విద్యుత్‌‌‌‌ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌తో పాటు ఇటీవల పంపిణీ చేసిన 600 డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో వందలాది ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో కాకతీయ అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ (కుడా)కి చెందిన మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ట్రైసిటీ చెత్త పికపింగ్‌‌‌‌ పాయింట్​గా మార్చడంతో నగరం నడిబొడ్డునే డంపింగ్‌‌‌‌ కేంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పర్యాటకులకు చారిత్రక నగర అందాలు కనిపించాల్సిన చోట ఇప్పుడు దుర్వాసన, వందలాది చెత్త ఆటోలు, ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి.

11 లక్షల జనాభా.. రోజూ 40 టన్నుల చెత్త

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధి 407.71 స్వ్కేర్​ కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 8.20 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 11 లక్షలకు చేరింది. రెండేండ్ల కింద జీడబ్ల్యూఎంసీ అధికారిక వివరాల ప్రకారం 66 డివిజన్లలో 2,54,354 ఇండ్లు, 183 స్లమ్‌‌‌‌లు ఉన్నాయి. శానిటేషన్‌‌‌‌ విభాగంలో 2,796 మంది సిబ్బంది పనిచేస్తుండగా, చెత్త సేకరణ కోసం 358 స్వచ్ఛ ఆటోలు, 82 ట్రాక్టర్లు, 13 టిప్పర్లు, 12 స్వీపింగ్‌‌‌‌ మిషన్లు తదితర వాహనాలతో కలిపి మొత్తం 493 వాహనాలు వినియోగిస్తున్నారు. సగటున జీడబ్ల్యూఎంసీ పరిధిలో రోజుకు దాదాపు 40 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. 

సిటీ మధ్యలోకి డంపింగ్.. 

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని 66 డివిజన్ల నుంచి ప్రతిరోజూ చెత్త సేకరించి గతంలో వరంగల్‌‌‌‌లోని పోతననగర్‌‌‌‌ ప్రాంతంలో భద్రకాళి చెరువు నాలా సమీపంలోని పికపింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు తరలించేవారు. అక్కడి నుంచి టిప్పర్లు, లారీల ద్వారా సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని మడికొండ డంపింగ్‌‌‌‌ యార్డుకు తీసుకెళ్లి బయోమైనింగ్‌‌‌‌ ప్రక్రియ నిర్వహించేవారు. అయితే కొద్ది నెలల కింద ఈ పికపింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను హనుమకొండ నగర మధ్యలో ఉన్న ‘కుడా’కు చెందిన మూడు ఎకరాల స్థలానికి మార్చారు. నగరం నుంచి మడికొండకు చెత్త తరలించే దూరం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు తగ్గుతుందనే కారణంతో ఈ మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

శ్వాస కష్టాలు..

ఇప్పటివరకు నగర అందాలతో ఆకట్టుకున్న హనుమకొండ బస్టాండ్‌‌‌‌ ప్రాంతం ప్రస్తుతం దుర్వాసన, వందలాది చెత్త వాహనాలతో కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెత్త పికపింగ్‌‌‌‌ కార్యకలాపాలు కొనసాగడంతో బస్టాండ్‌‌‌‌కు వచ్చే ప్రయాణికులు, 600 డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇళ్ల నివాసితులు, స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, వాకింగ్‌‌‌‌కు వచ్చే ప్రజలు, సాయిబాబా ఆలయ భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాలనీల నుంచి వచ్చే వందలాది చెత్త వాహనాల కారణంగా ట్రాఫిక్‌‌‌‌ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మాతాశిశు, అత్యవసర వైద్య సేవలు అందించే పలు ఆస్పత్రులు ఉన్నాయి. చెత్త దుర్వాసన, వాహనాల రద్దీ కారణంగా ఆస్పత్రులకు వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పలు సందర్భాల్లో చెత్తకు మంటలు అంటుకోవడంతో దుర్వాసనతో కూడిన పొగ దాదాపు కిలోమీటరున్నర మేర వ్యాపిస్తోంది. దీంతో ప్రయాణికులు, భక్తులు, ఆస్పత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నగర మధ్యలో ఉన్న కుడా స్థలంలోని ఈ చెత్త పికపింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను వెంటనే నగర శివారుకు తరలించాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా నగర అవతల కుడాకు చెందిన ఇతర ప్రభుత్వ భూములను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.