ఆరు జాతీయ పార్టీల ఆదాయం 3 వేల 77 కోట్లు

ఆరు జాతీయ పార్టీల ఆదాయం 3 వేల 77 కోట్లు
  • 2,361కోట్ల ఇన్​కంతో బీజేపీ టాప్​: ఏడీఆర్

న్యూఢిల్లీ:  2022–23 ఆర్థిక సంవత్సరంలో  దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు దాదాపు రూ. 3,077 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఒక్క బీజేపీకే రూ. 2,361కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధవారం వెల్లడించింది. ఇది ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన ఇన్ కంలో 76.73 శాతమని వివరించింది. ఇక రూ.452.375 కోట్ల ఆదాయంతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తం ఆదాయంలో  కాంగ్రెస్‌‌కు 14.70 శాతం ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌‌తో పాటు బీఎస్పీ, ఆప్, ఎన్‌‌పీపీ, సీపీఐ-(ఎం) కూడా  తమ ఆదాయాన్ని ప్రకటించాయి.

రూ. 443 కోట్లు పెరిగిన బీజేపీ ఇన్ కం

ఏడీఆర్ ప్రకారం.. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో  బీజేపీ ఆదాయం రూ. 1917.12 కోట్లు కాగా..2022–-23 నాటికి రూ. 2360.844 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ. 443.724 కోట్లు(23.15 శాతం) ఇన్ కం పెరిగింది. 2021–-22లో ఎన్‌‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) ఆదాయం రూ. 47.20 లక్షలు కాగా..2022–-23 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 7.5 కోట్లకు చేరింది. అంటే సుమారు రూ. 7.09 కోట్లు ఆదాయం (1502.12 శాతం) వచ్చింది.  అదేవిధంగా, ఆప్ ఆదాయం 2021–-22లో రూ. 44.539 కోట్లు కాగా..2022–23 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 85.17 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే 91.23 శాతం (రూ. 40.631 కోట్లు) పెరిగింది. 

ఇక 2021–-22, 2022–-23 ఆర్థిక సంవత్సరం మధ్య, కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీఎస్పీల ఆదాయం వరుసగా 16.42 శాతం (రూ. 88.90 కోట్లు), 12.68 శాతం (రూ. 20.575 కోట్లు), 33.8014 శాతం (రూ. 20.575 కోట్లు) తగ్గింది. కాంగ్రెస్ మొత్తం ఆదాయం రూ. 452.375 కోట్లు కాగా.. అది రూ. 467.135 కోట్లు ఖర్చు చేసింది. ఏడాదిలో ఆ పార్టీ ఖర్చులు ఆదాయం కంటే 3.26 శాతం ఎక్కువ అయ్యాయి. సీపీఐ(ఎం) మొత్తం ఆదాయం రూ. 141.661 కోట్లు కాగా.. రూ. 106.067 కోట్లు ఖర్చు చేసింది.- ఇది ఆదాయంలో 74.87 శాతంగా ఉంది. అదేవిధంగా.. ఆప్ మొత్తం ఆదాయం రూ.85.17 కోట్లు కాగా.. రూ.102.051 కోట్లు ఖర్చు చేసింది. అంటే వచ్చిన ఆదాయం కంటే 19.82 శాతం ఎక్కువ ఖర్చులు చేసింది.