- ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ
- 1: 50 రేషియోలో అభ్యర్థుల ఎంపిక
- అక్టోబర్ 21 నుంచి మెయిన్ ఎగ్జామ్స్
- -ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మెయిన్ ఎగ్జామ్‌కు 31,382 మంది ఎంపికైనట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఫలితాలను https://www.tspsc.gov.in వెబ్ సైట్లో చూసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్‌కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.02 లక్షల మంది పరీక్ష రాశారు.
అదే నెల 24న ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్లో కమిషన్ పెట్టింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఆబ్జెక్షన్లను పరిశీలించిన తర్వాత.. ఆదివారం ఉదయం ఫైనల్కీని రిలీజ్ చేసింది.
150 మార్కులతో కూడిన క్వశ్చన్ పేపర్లో 56, 59 నెంబర్ల ప్రశ్నలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 17వ క్వశ్చన్‌కు రెండు ఆన్సర్స్ కరక్ట్ అని తెలిపింది. ఫైనల్ కీ రిలీజ్ చేసిన కొద్దిసేపట్లోనే ఫలితాలనూ విడుదల చేసింది.
1:50 ప్రకారమే...
గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థులను 1:50 రేషియోలోనే ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. గతంలో సర్కారు ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 50 మంది మెయిన్స్‌కు ఎంపిక చేశారు. దీని ప్రకారం 28,150 మందిని మాత్రమే ప్రకటించాల్సి ఉన్నా... 31,382 మందిని ఎంపిక చేశారు. దీనికి రిజర్వ్ డ్ కేటగిరీలో తక్కువ మంది ఉండటంతో, మెరిట్ లిస్టు నుంచి మరింత మందిని ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది.
అయితే, 1:100 రేషియోలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్న రేషియో మారిస్తే మళ్లీ లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సర్కారు ప్రకటించింది.
పరీక్ష రాసినవాళ్లే కీ చూసుకునేలా..!
గ్రూప్ 1 ప్రిలిమినరీ కీతో పాటు ఫైనల్ కీ కూడా టీజీపీఎస్సీ గుట్టుగానే పెట్టింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మాత్రమే చూసుకునేలా అవకాశం కల్పించింది. అయితే, కొత్త కమిషన్ వచ్చిన తర్వాతే ఈ విధానం అమల్లోకి వచ్చింది. టీజీపీఎస్సీ ఐడీ, ఎగ్జామ్ హాల్ టికెట్, డేటాఫ్ బర్త్ వంటి వివరాలు కొడితేనే.. ఫైనల్ కీ చూసుకునే వీలుంటుంది.
సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
గ్రూప్ - 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహ పడవద్దని అన్నారు.
‘‘జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం.. దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారు” అని ఆయన సూచించారు.
అక్టోబర్ 21 నుంచి మెయిన్ ఎగ్జామ్స్
అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఏడు రోజుల పాటు గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొదటిరోజు అక్టోబర్ 21న క్వాలిఫైయింగ్ టెస్టు ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాతి ఆరు వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయి. అన్నీ పరీక్షలూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. క్వాలిఫైయింగ్టెస్ట్ (జనరల్ ఇంగ్లీష్) మినహా మిగిలిన అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది.
గ్రూప్- 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్..
అక్టోబర్ 21 : జనరల్ ఇంగ్లీష్
(క్వాలిఫైయింగ్)
అక్టోబర్ 22 : పేపర్- 1 (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 : పేపర్- 2 (హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్)
అక్టోబర్ 24 : పేపర్- 3 (ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్)
అక్టోబర్ 25 : పేపర్- 4 (ఎకానమీ, డెవలప్‌మెంట్)
అక్టోబర్ 26 : పేపర్- 5 (సైన్స్,
టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
అక్టోబర్ 27 : పేపర్- 6 (తెలంగాణ
ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)
