మరో ఇద్దరు​ టీచర్లను బలి తీసుకున్న 317జీవో

మరో ఇద్దరు​ టీచర్లను బలి తీసుకున్న 317జీవో
  • వేరే జిల్లాకు ట్రాన్స్​ఫర్​ చేయడంతో ఆర్మూర్ లో ఒకరు సూసైడ్    
  • బదిలీపై మనస్తాపంతో అనారోగ్యం పాలై హనుమకొండలో మరొకరు మృతి

మోర్తాడ్/ఆర్మూర్/మహబూబాబాద్​, వెలుగు: 317 జీవో మరో ఇద్దరు టీచర్లను బలిదీసుకుంది. కుటుంబ పరిస్థితులు బాగాలేని టైమ్ లో వేరే జిల్లాకు ట్రాన్స్​ఫర్​ చేయడంతో మనస్తాపం చెంది.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన ఎస్​బీటీ బేతల సరస్వతి (35) సూసైడ్​ చేసుకున్నారు. 
సరస్వతి భీంగల్​మండలంలోని బాబాపూర్ లో పని చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల వయస్సున్న ఇద్దరు కవలలు ఉన్నారు. భర్త బేతల భూమేశ్​ఉపాధి కోసం కొన్నేండ్ల కింద ఖతర్​వెళ్లాడు. సరస్వతి ఆర్మూర్​లోని తన సొంత ఇంట్లో ఉంటూ, పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ.. అక్కడి​నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని బాబాపూర్​వెళ్లి వస్తోంది. కానీ తాజాగా 317 జీఓ ప్రకారం సరస్వతిని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాలోని ప్రైమరీ స్కూల్ కు ట్రాన్స్​ఫర్ చేశారు. ఇది ఆర్మూర్​నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. తన భర్త లోకల్​గా ఉండరని, తనకు కవల పిల్లలు ఉన్నారని, అంత దూరం వెళ్లి రాలేనని చెప్పినా ఆఫీసర్లు  వినిపించుకోలేదు. దీంతో ఇటీవల సరస్వతి మర్లకుంట తండాకు వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చింది. అది సింగిల్ టీచర్ స్కూల్​కావడం, అవసరమైతే సెలవు కూడా పెట్టే చాన్స్​లేకపోవడంతో మరింత ఆందోళన చెందింది.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలను ఆడుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లమని చెప్పిన సరస్వతి.. ఇంట్లో ఉరి వేసుకుంది. ఇరుగుపొరుగు గమనించి దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ సూసైడ్ విషయం తెలుసుకున్న ఎంఈఓ స్వామి.. ఆర్మూర్ లోని దవాఖానకు వెళ్లి వివరాలు తెలుకున్నారు. 
ప్రభుత్వ తీరు వల్లే టీచర్​ ఆత్మహత్య: బీజేపీ  
బదిలీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే  టీచర్ సరస్వతి సూసైడ్​చేసుకుందని ఆర్మూర్ బీజేపీ లీడర్లు ఆరోపించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన wతెలిపారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్​లో టీచర్​కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెను కామారెడ్డికి ట్రాన్స్​ఫర్​చేయడం వల్లే కలత చెంది చనిపోయిందని లీడర్లు చెప్పారు. టీచర్ల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలేనని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ఆరోపించారు. సరస్వతి ఆత్మహత్య తమను కలచి వేసిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
అనారోగ్యం పాలై మరో టీచర్... 
వేరే జిల్లాకు బదిలీ చేశారనే మనస్తాపంతో అనారోగ్యానికి గురైన మరో టీచర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం నల్లకుంటకు  చెందిన పుల్యాల శ్రీమతి (మాధవి- 48) మహబూబాబాద్​జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల పంచాయతీ పరిధిలోని పూసల తండా ప్రైమరీ స్కూల్ లో ఎస్​జీటీగా పని చేస్తోంది. హన్మకొండలో ఉంటూ స్కూల్​కు వెళ్లి వస్తోంది. ఆమె భర్త హన్మకొండలోనే 108లో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. కొడుకు, కూతురు అక్కడే చదువుకుంటున్నారు. 317 జీవో ప్రకారం ఆమెను ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూర్​కు బదిలీ చేశారు. దీంతో చాలా దూరం వేశారని, ఆమె మనస్తాపానికి గురైంది. లోబీపీతో కిందపడి పోవడంతో వరంగల్ లోని ఆస్పత్రికి తరలించగా, ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. మాధవి మృతికి సర్కారే బాధ్యత వహించాలని టీపీఆర్​టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ అన్నారు.