317 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలి

317 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలి

భైంసా, వెలుగు: రెండేండ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్​సర్కారు విడుదల చేసిన 317 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలని తపస్ లీడర్లు సోమవారం భైంసాలో ఎమ్మెల్యే రామారావు పటేల్​కు వినతి పత్రం అందించారు.

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించడంలో భాగంగా స్థానికత అంశం లేకుండా, కేవలం సీనియారిటీ ఆధారంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కోసం తీసుకువచ్చిన 317 జీవోను పునఃసమీక్షించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.

ఈ జీవో కారణంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి తమ కుటుంబాలకు, సొంత జిల్లాలకు దూరమై అవ్యయ ప్రయాసాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, నాయకులు జి.రాజేశ్వర్, ధీరజ్ కులకర్ణి, రవీందర్, ఆర్.రాజేశ్వర్, బాపూజీ, బి.సంతోష్ తదితరులున్నారు.